Raj Kundra: రూ. 60 కోట్ల చీటింగ్ కేసు.. రాజ్ కుంద్రాకు నోటీసులు
రాజ్ కుంద్రాకు నోటీసులు
Raj Kundra: రూ. 60 కోట్లకు పైగా విలువైన ఆర్థిక మోసం కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 15న ముంబైలోని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
దీపక్ కొఠారీ అనే వ్యాపారవేత్త 2015-2023 మధ్య కాలంలో రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి యజమానిలుగా ఉన్న 'బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్' అనే కంపెనీలో దాదాపు రూ. 60.48 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే, ఆ డబ్బును కంపెనీ కోసం కాకుండా దంపతులు వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారని ఆయన ఆరోపించారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు మోసం, నమ్మక ద్రోహం వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును ఆర్థిక నేరాల విభాగానికి (EOW) బదిలీ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రాజ్ కుంద్రాకు సమన్లు జారీ చేయగా, మొదట సెప్టెంబర్ 10న హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఆయన కోరిన గడువు మేరకు విచారణను సెప్టెంబర్ 15కి వాయిదా వేశారు.
ఈ కేసు విచారణ కొనసాగుతుండగా, శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా తరచూ విదేశాలకు వెళ్తుండటంతో వారు దేశం విడిచి వెళ్లకుండా ఉండటానికి ఇటీవల అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.