Actress Isha Rebba: టాలీవుడ్‌లో వివక్ష: నీ మోచేతులు నల్లగా ఉన్నాయి అన్నారు.. ఈషా రెబ్బా ఆవేదన
ఈషా రెబ్బా ఆవేదన
Actress Isha Rebba: అచ్చతెలుగు అందం ఈషా రెబ్బా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి 12 ఏళ్లు దాటింది. అయితే బయటకు కనిపించే గ్లామర్ వెనుక ఎన్నో కన్నీటి గాధలు ఉన్నాయని ఆమె వెల్లడించారు. తన కొత్త చిత్రం ఓం శాంతి శాంతి ప్రమోషన్స్ సందర్భంగా ఈషా తన సినీ ప్రయాణంలోని చీకటి కోణాలను పంచుకున్నారు.
రంగు వివక్షపై ఈషా ఫైర్
కెరీర్ ఆరంభంలో ఒక స్టార్ డైరెక్టర్ తనను ఎంతలా అవమానించారో ఈషా గుర్తుచేసుకున్నారు. "ఒక ఫోటో షూట్ సమయంలో సదరు దర్శకుడు నా ఫోటోలను అంగుళం అంగుళం జూమ్ చేసి చూశారు. నీ మోచేతులు నల్లగా ఉన్నాయి.. నువ్వు ఇంకా తెల్లగా ఉండాలి అని ముఖం మీదే చెప్పారు. ఆ మాటలకు ఎంతో బాధ కలిగి చాలా సేపు ఏడ్చాను. నేను కూడా కొంచెం తెల్లగా పుట్టి ఉంటే బాగుండేదని అప్పట్లో అనిపించింది" అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.
అనాథగా ఉంటే టార్గెట్ చేస్తారు
తన వ్యక్తిగత జీవితంలోని విషాదాన్ని పంచుకుంటూ.. "మా అమ్మ మరణించిన 12వ రోజునే నేను షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. తల్లిదండ్రులు లేని ఆడపిల్లను ఇండస్ట్రీలో అందరూ టార్గెట్ చేస్తారు. సపోర్ట్ లేకపోతే చులకనగా చూస్తారు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీలకు వెళ్తేనే అవకాశాలా?
సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో కొందరు తనకు వింత సలహాలు ఇచ్చేవారని ఈషా తెలిపారు."అవకాశాలు రావాలంటే పార్టీలకు వెళ్లాలని కొందరు చెప్పారు. తెలుగు అమ్మాయిలా రిజర్వ్‌డ్‌గా ఉండకూడదని, మోడ్రన్‌గా కలవాలని సూచించేవారు. అయితే ఇలాంటి వాటికి తలొగ్గకుండా తన ప్రతిభనే నమ్ముకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను" అనిఆమె స్పష్టం చేశారు.