Actress Rimi Sen: రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన చిరు హీరోయిన్ !
చిరు హీరోయిన్ !
Actress Rimi Sen: బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 'ధూమ్'లో తన నటనతో అలరించిన నటి రిమీ సేన్, ప్రస్తుతం గ్లామర్ ప్రపంచానికి దూరంగా దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా తన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. రిమీ సేన్ వరుస హిట్ చిత్రాలతో 2000వ దశకంలో బాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగారు. అయితే, గత దశాబ్ద కాలంగా ఆమె వెండితెరకు దూరమయ్యారు. తాజాగా దుబాయ్‌కు చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థతో ఆమె జరిపిన సంభాషణలో.. తాను ప్రస్తుతం దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్నట్లుగా తెలిపారు.
భారత్ కంటే దుబాయ్‌లో వ్యాపారం చేయడం సులభమని రిమీ సేన్ అభిప్రాయపడ్డారు. ఆమె మాటల్లోనే: "దుబాయ్ చాలా స్వాగతించే నగరం. ఇక్కడ నిబంధనలు పారదర్శకంగా ఉంటాయి. మన దేశంలో ప్రభుత్వం రాత్రికి రాత్రే పాలసీలను మార్చేస్తుంటుంది, కానీ ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం అన్నీ జరుగుతాయి" అని ఆమె పేర్కొన్నారు. ఇండియాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లను చూసే విధానానికి, దుబాయ్‌లో వారికి లభించే గౌరవానికి చాలా తేడా ఉందని, అక్కడ ఏజెంట్లను 'ఫైనాన్షియల్ అడ్వైజర్స్'గా గుర్తిస్తారని ఆమె తెలిపారు.
చాలా కాలం తర్వాత రిమీ సేన్ ఒక ఇంటర్వ్యూ వీడియోలో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆమె రూపంలో వచ్చిన మార్పుల వల్ల చాలామంది ఆమెను గుర్తుపట్టలేకపోయారు. గతంలో తనపై వచ్చిన ప్లాస్టిక్ సర్జరీ వార్తలపై కూడా ఆమె స్పందించారు. తాను ఎటువంటి సర్జరీ చేయించుకోలేదని, కేవలం బాటాక్స్, ఫిల్లర్స్ వంటి ట్రీట్‌మెంట్స్ మాత్రమే తీసుకున్నట్లు స్పష్టం చేశారు. తెలుగు ప్రేక్షకులకు కూడా రిమీ సేన్ సుపరిచితురాలే. మెగాస్టార్ చిరంజీవి సరసన 'అందరివాడు' సినిమాలో ఆమె నటించిన సంగతి తెలిసిందే.