Actress Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన 'పోలీస్ కంప్లైంట్' సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఒక వివాదం తెరపైకి వచ్చింది. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు సంజీవ్ మేగోటి నటి వరలక్ష్మిపై సంచలన ఆరోపణలు చేశారు. అగ్రిమెంట్ ఉన్నప్పటికీ ఆమె సినిమా ప్రమోషన్లకు సహకరించలేదని, కేవలం ఒక గంట సమయం అడిగినా రాలేదని, డబ్బింగ్ సమయంలోనూ ఇబ్బంది పెట్టడం వల్ల సినిమాకు భారీ నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో, ఈ వివాదంపై నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తాజాగా స్పందించారు.

​తనపై వచ్చిన ఆరోపణలను వరలక్ష్మి సున్నితంగా తిప్పికొట్టారు. సినిమా ప్రమోషన్ల కోసం చిత్ర యూనిట్ తనను ఎప్పుడు పిలిచినా తాను హాజరయ్యానని ఆమె స్పష్టం చేశారు. చిత్ర బృందం అడిగిన ప్రతి కార్యక్రమానికి తాను అందుబాటులో ఉన్నానని చెబుతూ.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు తన గురించి నిర్దిష్టంగా ఏం మాట్లాడారో, ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారో తనకు పూర్తిగా తెలియదని, కాబట్టి ఆ కామెంట్స్‌పై ప్రస్తుతం తాను ఎలాంటి సుదీర్ఘ వివరణ ఇవ్వలేనని పేర్కొన్నారు.

​అయితే, ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయడానికి తాను ఇష్టపడటం లేదని వరలక్ష్మి తేల్చి చెప్పారు. చిత్ర యూనిట్‌తో విభేదాల గురించి పబ్లిక్‌గా మాట్లాడి రచ్చ చేయడం తనకు ఇష్టం లేదన్నారు. ఈ విషయంలో తన వైపు కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని, అయినప్పటికీ చిత్ర బృందం చేసిన ఆరోపణలను ఖండిస్తూ వారితో మాటల యుద్ధానికి దిగాలని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. మొత్తానికి దర్శకుడి ఆరోపణలకు వరలక్ష్మి ఎంతో సంయమనంతో, హుందాగా సమాధానం ఇచ్చి వివాదానికి పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. జూన్ 12న విడుదల కాబోతున్న ఈ హారర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఈ వివాదం తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags: