Mrunal Thakur and Pooja Hegde: మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డేలకు బాలీవుడ్‌లో మరో ఎదురుదెబ్బ

బాలీవుడ్‌లో మరో ఎదురుదెబ్బ

Update: 2026-06-10 02:02 GMT

Mrunal Thakur and Pooja Hegde: ప్రముఖ కథానాయికలు మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే నటించిన తాజా బాలీవుడ్ సినిమా “హై జవానీ తో ఇష్క్ హోనా హై” బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. సినిమా విడుదల కంటే ముందు ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ, థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ చిత్రం విఫలమైంది.

జూన్ 5న విడుదలైన ఈ సినిమా మొదటి ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది. ఇందులో భారతదేశంలో వచ్చిన వసూళ్లు దాదాపు రూ. 36 కోట్లుగా ఉన్నాయి. వరుణ్ ధావన్ లాంటి స్టార్ హీరోతో పాటు ఇద్దరు క్రేజీ హీరోయిన్లు ఉన్న ఈ సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం చాలా తక్కువని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో వరుణ్ ధావన్, ఈ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా కూడా థియేటర్లకు ప్రేక్షకులను భారీ సంఖ్యలో రాబట్టలేక ఇబ్బంది పడుతోంది.

ఈ సినిమా ఫలితం నటి మృణాల్ ఠాకూర్‌కు బాలీవుడ్‌లో మరో నిరాశను మిగిల్చింది. తెలుగు సినిమాల్లో అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్‌కు, ఆమె చేసిన తాజా హిందీ సినిమాలు మాత్రం ఆశించిన విజయాలను ఇవ్వడం లేదు. ఈ సంవత్సరంలో ఆమెకు హిందీ చిత్రసీమలో ఇది మరొక పరాజయంగా నిలిచింది.

మరోవైపు పూజా హెగ్డే గ్లామర్ నమ్ముకుని చేసిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ ప్రయత్నం కూడా ఈసారి బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. పూజా హెగ్డేకు బాలీవుడ్‌లో గత కొంతకాలంగా వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆమె నటించిన ఇటీవలి హిందీ చిత్రాలు ఏవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి, ఆ కష్టం ఈ సినిమాతోనూ కొనసాగింది.

ఈ సినిమా మొదటి వారంలో హిందీ మార్కెట్‌లో పోటీగా వేరే పెద్ద సినిమాలేవీ లేకపోవడం గమనార్హం. థియేటర్లలో వేరే గట్టి పోటీ లేనప్పటికీ, ప్రేక్షకులను ఆకర్షించడంలో మరియు ఈ మంచి అవకాశాన్ని వాడుకోవడంలో ఈ సినిమా పూర్తిగా విఫలం కావడం చిత్ర బృందాన్ని మరింత నిరాశకు గురిచేస్తోంది.

Tags:    

Similar News