Another Successor from Superstar Krishna’s Family: సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో వారసురాలు
మరో వారసురాలు
Another Successor from Superstar Krishna’s Family: సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో వారసురాలు వెండితెరపై అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనకోడలు, నటి-నిర్మాత మంజుల ఘట్టమనేని, నటుడు సంజయ్ స్వరూప్ దంపతుల గారాల పట్టి జాన్వీ స్వరూప్ ఘట్టమనేని హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించబడింది.
జాన్వీ పుట్టినరోజు సందర్భంగా ఆమె తల్లి మంజుల ఘట్టమనేని సోషల్ మీడియాలో కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేస్తూ ఈ విషయాన్ని ధృవీకరించారు. "త్వరలో తన ప్రతిభ, వెలుగుని ప్రపంచానికి చూపించబోతోంది. వెండి తెర, ఈ ప్రపంచం నీ కోసం ఎదురుచూస్తోంది మై డార్లింగ్. లవ్యూ సో మచ్, హ్యాపీ బర్త్ డే జాను" అంటూ ఆమె తన కుమార్తెను ఆశీర్వదించారు.
జాన్వీ షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె సంప్రదాయ మరియు మోడర్న్ లుక్స్‌లో మెరుస్తూ, ఘట్టమనేని వంశపు అందాన్ని పుణికిపుచ్చుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ అయితే, జాన్వీ టాలీవుడ్‌లోని యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుందని అభిప్రాయపడుతున్నారు.
జాన్వీకి నటన కొత్తేమీ కాదు. 2018లో తన తల్లి మంజుల దర్శకత్వం వహించిన 'మనసుకు నచ్చింది' చిత్రంలో ఆమె బాలనటిగా అతిథి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఆమె పూర్తిస్థాయి హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఘట్టమనేని కుటుంబం నుంచి కథానాయికగా వస్తున్న తొలి వ్యక్తి జాన్వీ కావడం విశేషం. జాన్వీ ఘట్టమనేని హీరోయిన్‌గా నటించబోయే తొలి ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.