లండన్ Royal Albert Hallలో రెహ్మాన్ చారిత్రాత్మక సంగీతం

మూడు రోజుల సొల్డ్-అవుట్ ఆర్కెస్ట్రల్ షో… భారతీయ–పాశ్చాత్య సంగీతాల కలయికతో అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక మైలురాయి

Update: 2026-04-28 09:49 GMT

ఆస్కార్ అవార్డు విజేత సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహ్మాన్ (A R Rahman) తన గ్లోబల్ కచేరీ ప్రయాణంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో (London’s Royal Albert Hall) జరిగిన మూడు రోజుల సొల్డ్-అవుట్ ఆర్కెస్ట్రల్ ప్రదర్శన ద్వారా ఆయన విశేష స్పందనను సొంతం చేసుకున్నారు. కంపోజర్, అసోసియేట్ ఆర్టిస్ట్ రుషిల్ రంజన్‌తో కలిసి రూపొందించిన ఈ ప్రత్యేక కార్యక్రమం, ఎదుగుతున్న ప్రతిభావంతులు, అంతర్జాతీయ స్థాయి సంగీతకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. భారతీయ, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాల మధ్య అద్భుతమైన సమ్మేళనాన్ని ఈ ప్రదర్శన చూపించింది.


అంతర్జాతీయ వేదికపై..

“A.R. Rahman x Rushil Ranjan” పేరుతో నిర్వహించిన ఈ షో, పాపులారిటీ మాత్రమే కాకుండా ఉద్దేశ్య పరంగానూ ప్రత్యేకతను చాటుకుంది. ముఖ్యంగా కొత్త తరం సంగీతకారులను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది “రంగ్రేజా” అనే కొత్త కూర్పు. రెహ్మాన్, రుషిల్ కలిసి రూపొందించిన ఈ సంగీత కృతి, సూఫీ తత్వాన్ని ప్రతిబింబిస్తూ, సంస్కృతుల మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుసంధానాన్ని సంగీత రూపంలో వ్యక్తపరిచింది. రాయల్ ఫిలహార్మోనిక్ ఆర్కెస్ట్రా, లండన్ వాయిసెస్‌తో పాటు అసోసియేట్ ఆర్టిస్ట్ అబి సంపా ఈ కృతిని ప్రదర్శించారు. మెల్విన్ టే దర్శకత్వంలో ఈ సంగీత ప్రదర్శన జరిగింది.

ఈ కార్యక్రమానికి భావోద్వేగ పరంగా మరింత బలం చేకూర్చింది రెహ్మాన్ స్థాపించిన KM మ్యూజిక్ కన్జర్వేటరీ, సన్‌షైన్ ఆర్కెస్ట్రాకి చెందిన యువ సంగీతకారుల ప్రదర్శన. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన ఈ ప్రతిభావంతులు అంతర్జాతీయ స్థాయి ఆర్కెస్ట్రాతో కలిసి ప్రదర్శన ఇవ్వడం ఒక అరుదైన ఘట్టంగా నిలిచింది.

రెహ్మాన్ మాట్లాడుతూ

“సన్‌షైన్ ఆర్కెస్ట్రా యువకులు రాయల్ ఫిలహార్మోనిక్ ఆర్కెస్ట్రాతో కలిసి వేదిక పంచుకోవడం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. గురువుగా ఇలాంటి క్షణాలు ఎంతో ప్రేరణనిస్తాయి. ఎలాంటి ఆశలు లేకుండా మంచి కోసం విత్తనాలు వేస్తే, జీవితం అద్భుత ఫలితాలు ఇస్తుంది. ఈ యువ సంగీతకారులు భారత్‌కు గర్వకారణం అవుతున్నారు,” అని అన్నారు. ఈ ప్రదర్శనలో ప్రముఖ గాయకుడు సార్థక్ కళ్యాణి, పర్కషనిస్ట్ జనన్ సతీంద్రన్ పాల్గొన్నారు. అలాగే ప్రఖ్యాత నృత్యకారుడు ఆకాశ్ ఒడేద్రా రూపొందించిన నృత్య రూపకాలు ఈ సంగీత కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


భారతీయ సంగీతాన్ని

కొత్త కృతులతో పాటు, రెహ్మాన్ ప్రసిద్ధ చిత్రాలైన జోధా అక్బర్, గురు, 127 అవర్స్, రాక్‌స్టార్ చిత్రాల సంగీతాన్ని ఆర్కెస్ట్రల్ రూపంలో వినిపించడం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ ప్రదర్శన భారతీయ చిత్ర సంగీతం ప్రపంచ వేదికపై ఎలా రూపాంతరం చెందుతోందో స్పష్టంగా చూపించింది. పెద్ద స్థాయి ఆర్కెస్ట్రల్ ఫార్మాట్‌లో భారతీయ సంగీతాన్ని ప్రపంచ ప్రేక్షకులకు చేరవేయడంలో ఇది ఒక కొత్త దిశగా నిలిచింది. మొత్తంగా ఈ కచేరీ కేవలం సంగీత ప్రదర్శన మాత్రమే కాదు… సంస్కృతుల సమ్మేళనం, కొత్త తరానికి ప్రపంచ వేదికపై గుర్తింపు తీసుకువచ్చిన ఒక గొప్ప సాంస్కృతిక వేడుకగా నిలిచింది.

Tags:    

Similar News