Harihara Veera Mallu : ముఖ్యమంత్రి మాటలు నీటి మీద రాతలేనా…?

హరిహరవీరమల్లు బెనిఫిట్‌ షోకు, టిక్కెట్ల పెంపుకు అనుమతి;

Update: 2025-07-22 11:30 GMT
  • నేను సీయంగా ఉండగా బెనిఫిట్‌ షోలు, టెక్కెట్ల పెంపు ఉండవని గతంలో ప్రకటించిన రేవంత్‌ రెడ్డి
  • ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంచుమించు ఇదే పరిస్ధితి

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి మాటలు నీటి మీద రాతల్లా మిగిలిపోతున్నాయా…? ఆయన తీసుకున్న నిర్ణయాలను ఆయనే పాటించడం లేదా…? అవుననే అంటున్నారు ఆయన ప్రత్యర్ధులు. పుష్ప సినిమా ప్రీమిర్‌ షో సందర్భంగా సంధ్య ధియేటర్లో జరిగిన తొక్కిసలాట వ్యవహారంపై అప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అనుమతి లేని షో వేసి ఒకరి ప్రాణం పోవడానికి మరొకరు కోమాలోకి వెళ్లడానికి కారకులయ్యారంటూ సంధ్యా ధియేటర్‌ యజమానులు, పుష్ప-2 హీరో, నిర్మాతలపై కేసులు పెట్టారు. సంధ్యా ధియేటర్‌ యజమానులను, హీర అల్లు అర్జున్ని అరెస్టులు కూడా చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కూడా ఈ వ్యవహారంపై వాడీ వేడి చర్చలు జరిగాయి. ఆ సందర్భంలో తాను ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణలో ఏ సినిమాకి బెనిఫిట్‌ షోలకు, టిక్కెట్‌ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వనని తెగేసి చెప్పారు. అదే సందర్భంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా ఇకపై రాష్ట్రంలో ఏ సినిమాకి బెనిఫిట్‌ షోలు ఉండవని ఖరాఖండీగా చెప్పేశారు.

ఆ తరువాత కొన్ని రోజులకు తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌ రాజు మధ్యవర్తిత్వంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు చాలా మంది పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లో సీయం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీయం మల్లుభట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో భేటీ అయి వారికి శాలువాలు కప్పి మీరెలా అంటే అలా అని సీయం రేవంత్‌ రెడ్డి బృందాన్ని తృప్తి పరిచారు. ఆ తరువాత కొన్ని రోజులకే చడీచప్పుడు లేకుండా విడదలైన రామచరణ్‌ సినిమా గేమ్‌ ఛేంజర్‌ కు టిక్కెట్లు ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఆ తరువాత పెద్దగా ఈ టాపిక్‌ ఎక్కడా రాలేదు. మళ్ళీ ఇన్ని నెలలకు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన హరిహరవీరమల్లు సినిమా విడుదల సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చింది. హరిహరవీరమల్లు సినిమాకి బెనిఫిట్‌ షో వేసుకోవడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి కూడా అనుతిస్తూ జీఓ విడుదల చేశారు.

హరిహరవీరమల్లు సినిమా విడుదలకు ముందు రోజు తెలంగాణలో బెనిఫిట్‌ షో వేసుకోవడానికి, ఆ షోకు సంబంధించి టిక్కెట్ల ధరను 600కు అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక సినిమా విడుదల అవుతున్న జూలై 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ తెలంగాణలో ఉన్న అన్ని మల్టీప్లెక్స్‌ ధియేటర్లలో ప్రస్తుతం ఉన్న టిక్కెట్‌ ధరలకు అదనంగా మరో 200 రూపాయలు పెంచుకోవడానికి, సింగ్‌ స్క్రీన్‌ ధియేటర్లలో అదనంగా మరో 150 రూపాయలు పెంచుకునేలా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే జూలై 28వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకూ మల్టీప్లెక్సుల్లో 150 రూపాయలు, సింగ్‌ స్క్రీన్‌ ధియేటర్లతో వంద రూపాయలు ఒక్కో టిక్కెట్‌ పై అదనంగా పెంచుకునేందుకు హరిహరవీరమల్లు చిత్రానికి అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ లెక్కన చూస్తే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆయన చేసిన ప్రతిజ్ఞను ఆయనే పాటించలేకపోయారు. సినీవర్గాల నుంచి వచ్చిన అభ్యర్ధనలు, సన్నిహుతల నుంచి ఒత్తిళ్ళు కారణం ఏమైనా ఇకపై బెనిఫిట్‌ షోలు, టెక్కట్ల పెంపు ఉండవని శపథం చేసిన సీయం రేవంత్‌ రెడ్డి కొన్ని నెలలకే తన శపథాన్ని తీసి గట్టు మీద పెట్టేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఆ మధ్య ఎగ్జిబీటర్లు ధియేటర్ల మూసివేతకు ఇచ్చిన పిలుపు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహానికి గురయ్యింది. తన సినిమా హరిహరవీరమల్లు విడదలవుతున్న సమయంలో ఎగ్జిబీటర్లు ధియేటర్లు మూసివేస్తామని ప్రకటించడం తనపై జరుగుతున్న కుట్రగా డిప్యూటీ సీయం భావించారు. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి ఘాటు లేఖ రాశారు. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలకు బెనిఫిట్‌ షోలకు, టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలన్నా సదరు సినిమా నిర్మాతలు గానీ హీరోలు కానీ ప్రభుత్వాన్ని సందప్రదించడానికి కుదరదని, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎలాంటి ప్రతిపాదనైనా ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ద్వారా మాత్రమే రావాలని, అలా వస్తేనే ఆ ప్రతిపానను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పరిశీలిస్తుందని డిప్యూటీ సీయం హోదాలో పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. అయితే తాజాగా హరిహరవీరమల్లు సినిమాకి ఆంధ్రలో బెనిఫిట్‌ షోకు, టిక్కెట్ల పెంపుకు అనుమతి లభించింది. కానీ ఈ అనుమతికి తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చినట్లు దాఖలాలు లేవు.

Tags:    

Similar News