Actor Arya: ఆ దర్శకుడు అడిగితే గాడిదలా కూడా నటిస్తా.. ఆర్య షాకింగ్ కామెంట్స్
ఆర్య షాకింగ్ కామెంట్స్
Actor Arya: సినీ పరిశ్రమలో హీరోలు, దర్శకుల మధ్య ఉండే కెమిస్ట్రీ సినిమాల రిజల్ట్‌పై భారీ ప్రభావం చూపుతుంది. నటుడు ఆర్య విషయానికొస్తే, దర్శకులు బాలా, పా.రంజిత్‌లు ఆయనకు గురువుల లాంటి వారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన దర్శకులపై ఉన్న నమ్మకాన్ని ఆర్య వినూత్నంగా చాటుకున్నారు.
బాలా అడిగితే గాడిదలా అయినా చేస్తా
దర్శకుడు బాలా అంటే ఆర్యకు ఎంతటి గౌరవమో ఆయన మాటల్లోనే అర్థమవుతోంది. "ఒకవేళ బాలా గారు ఏదైనా సినిమాలో నన్ను గాడిదలా నటించమని అడిగినా.. నేను మరో మాట లేకుండా అంగీకరిస్తాను" అని ఆర్య వ్యాఖ్యానించారు. ఈ సినిమా కోసం అఘోరీ లుక్ లోకి మారమని ఒక నెల ముందే బాలా చెప్పారని, కథతో సంబంధం లేకుండా కేవలం ఆయనపై ఉన్న నమ్మకంతోనే ఆ పాత్రకు ప్రాణం పోశానని ఆర్య గుర్తు చేసుకున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన వాడు వీడు, పరదేశి సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
కథ చెప్పకుండానే సినిమా చేస్తున్న పా.రంజిత్
మరో స్టార్ డైరెక్టర్ పా.రంజిత్ గురించి చెబుతూ.. "రంజిత్ నాకు వెట్టువమ్ కథ చెప్పలేదు. అడిగితే.. ఒకవేళ కథ చెబితే నువ్వు చేయవేమో, అందుకే చెప్పను అని సరదాగా అంటారు" అని ఆర్య తెలిపారు. వీరిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం వృత్తిపరమైందే కాదు, అంతకు మించిన స్నేహమని ఆర్య పేర్కొన్నారు.
సార్పట్ట 2:
బాక్సింగ్ నేపథ్యంలో భారీ విజయాన్ని అందుకున్న సార్పట్టకు సీక్వెల్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం ఆర్య మళ్ళీ తన శరీరాకృతిని మార్చుకునే పనిలో ఉన్నారు. రాజా రాణి తరహాలో మరో క్లీన్ రొమాంటిక్ కామెడీ చిత్రంలో కూడా నటిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఆర్య లేటెస్ట్ మూవీ మిస్టర్ ఎక్స్ ఏప్రిల్ 17 గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమా రిజల్ట్ పట్ల చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.