Producers Furious: పెద్ది సినిమా వేళ బ్లాక్‌మెయిలా?..ఎగ్జిబిటర్ల తీరుపై నిర్మాతలు ఫైర్

ఎగ్జిబిటర్ల తీరుపై నిర్మాతలు ఫైర్

Update: 2026-05-14 06:22 GMT

Producers Furious: తెలంగాణ చిత్ర పరిశ్రమలో ఎగ్జిబిటర్లు వర్సెస్ నిర్మాతల మధ్య పర్సంటేజీ వివాదం ముదురుతోంది. పర్సంటేజీ విధానానికి అంగీకరించిన సినిమాలనే ప్రదర్శిస్తామంటూ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంపై యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఘాటుగా స్పందించింది. బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాతలు రవిశంకర్ యలమంచిలి, నాగవంశీ, సాహు గారపాటి తమ వాదనను బలంగా వినిపించారు.

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. "మేం ఎవరికీ వ్యతిరేకం కాదు, సినిమా అనేది ఒక ఎకో సిస్టమ్. ఎగ్జిబిటర్ల ఇబ్బందులను మేం అర్థం చేసుకుంటాం, కానీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇబ్బందుల్లో ఉన్నారనే విషయాన్ని మర్చిపోకూడదు" అని అన్నారు. ఎగ్జిబిటర్ వ్యవస్థలో మార్పు అవసరమే కానీ, అది చర్చల ద్వారా జరగాలి తప్ప ఇలాంటి ఒత్తిళ్ల వల్ల కాదని హితవు పలికారు.

ముఖ్యంగా ‘హరిహర వీరమల్లు’ సమయంలో రాని ఈ పర్సంటేజీ డిమాండ్, ఇప్పుడు ‘పెద్ది’ సినిమా విడుదల వేళ బయటకు రావడంపై ఆయన మండిపడ్డారు. "సినిమా విడుదలకు ముందు ఇలా బ్లాక్‌మెయిల్‌ చేయడం సమంజసం కాదు. అడిగిందల్లా ఇచ్చుకుంటూ పోతే నిర్మాతలు ఎలా బతుకుతారు?" అని ప్రశ్నించారు. అంతేకాదు, ఏ పెద్ద సినిమా నిర్మాతైనా పర్సంటేజీ పద్ధతికి ఒప్పుకుంటే.. ఫిల్మ్‌నగర్‌లో ఆయన విగ్రహం పెడతామంటూ రవిశంకర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

మరో నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. ఎగ్జిబిటర్ల వ్యాఖ్యలు బెదిరించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సెక్టార్ల ప్రతినిధులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని గిల్డ్ సభ్యులు స్పష్టం చేశారు. మరి ఈ వివాదం ఇక్కడితో సర్దుమణుగుతుందా? లేక 'పెద్ది' వంటి పెద్ద సినిమాల విడుదలపై ప్రభావం చూపుతుందా? అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News