Rakul Preet Singh: టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల మధ్య ఉన్న అసలైన వ్యత్యాసం ఇదేనంటూ అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వృత్తిపరంగా తన ఎదుగుదల తెలుగు చిత్రసీమలోనే జరిగిందని గర్వంగా చెబుతున్న ఈ భామ.. బాలీవుడ్ కంటే తెలుగు ఇండస్ట్రీలోనే ఐక్యత, పరస్పర సహకారం చాలా ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేసింది. పలు హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన రకుల్.. ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉంటూనే రెండు పరిశ్రమల పనితీరుపై కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకుంది.

టాలీవుడ్‌లో హెల్దీ కాంపిటీషన్

రకుల్ మాట్లాడుతూ.. "టాలీవుడ్ లో ఒకరి సినిమాల్ని మరొకరు ప్రచారం చేస్తూ, బహిరంగంగా సపోర్ట్ చేసుకుంటారు. అక్కడ స్టార్స్ మధ్య బలమైన పోటీ ఉన్నప్పటికీ.. ఎలాంటి సంకోచం లేకుండా ఇతర నటీనటుల విజయాలను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఇండస్ట్రీ అంతా ఒకే కుటుంబంలా ఉంటుంది" అని తెలుగు పరిశ్రమను ఆకాశానికెత్తింది.

బాలీవుడ్‌లో అభద్రతా భావం, నెగెటివిటీ

కానీ బాలీవుడ్ పరిస్థితులు దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయంటూ రకుల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. "ముంబైలో సినీతారల మధ్య ఉన్న అభద్రతా భావం (Insecurity) వల్ల ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోకుండా అడ్డుకుంటుంది. ఇక్కడ ఒకరిపై ఒకరు ప్రతికూల ప్రచారం (Negative Publicity) చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. ఈ నెగెటివిటీని తొలగిస్తేనే బాలీవుడ్ తిరిగి గాడిలో పడుతుంది. అందరూ ఏకతాటిపై నిలిస్తేనే అది మరింత బలమైన పరిశ్రమగా మారుతుంది" అంటూ రకుల్ బాలీవుడ్ స్టార్స్‌కు హితవు పలికింది.

Tags: