Bollywood Star Ajay Devgn: హైదరాబాద్‌లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఫిల్మ్ సిటీ..
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఫిల్మ్ సిటీ..
Bollywood Star Ajay Devgn: తెలంగాణను3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ఈ సదస్సు వినోదం, పర్యాటక రంగాల్లో రాష్ట్రానికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వనుంది.
భారత్ ఫ్యూచర్ సిటీలో రెండు ఫిల్మ్ సిటీలు
ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ హైదరాబాద్ శివారులోని భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. ఈ సదస్సులోనే దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకోనున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న రెండో ఫిల్మ్ సిటీ ఇది. ఇప్పటికే మరో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు కూడా ప్రభుత్వం ఇక్కడ భూమిని కేటాయించింది.
పర్యావరణం, పర్యాటకంలో రిలయన్స్ గ్రూప్
ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ గ్రూప్ కూడా తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. రిలయన్స్‌కు చెందిన వంతారా' యానిమల్ రెస్క్యూ సెంటర్, వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ, నైట్ సఫారీని ఏర్పాటు చేయడానికి సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఫ్యూచర్ సిటీలోని 15,000 ఎకరాల అటవీ ప్రాంతంలో లేదా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దీన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త ఊపు ఇస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఫుడ్ లింక్' ద్వారా రూ. 3,000 కోట్ల హోటల్స్
విలాసవంతమైన కేటరింగ్ సేవలకు పేరుగాంచిన ఫుడ్ లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్ కంపెనీ రూ. 3,000 కోట్ల పెట్టుబడితో ఫ్యూచర్ సిటీలో మూడు స్టార్ హోటళ్లను నిర్మించనుంది. దీనికి సంబంధించిన ఒప్పందం కూడా సదస్సులోనే జరగనుంది. మొత్తంమీద తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో భాగంగా జరుగుతున్న ఈ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమైన పెట్టుబడులను తీసుకురానుందని స్పష్టమవుతోంది.