Trending News

Singer Chinmayi Sripada: కాస్టింగ్ కౌచ్‌పై చిరంజీవి వ్యాఖ్యలకు చిన్మయి కౌంటర్

చిరంజీవి వ్యాఖ్యలకు చిన్మయి కౌంటర్

Update: 2026-01-27 08:12 GMT

Singer Chinmayi Sripada: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'కాస్టింగ్ కౌచ్' (లైంగిక వేధింపులు) సంస్కృతి లేదని మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. "పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదు, అది వ్యక్తిగత ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. సినిమా రంగం ఒక అద్దం లాంటిది, మీరు ఎలా ఉంటే అది అలాగే ప్రతిబింబిస్తుంది" అని వ్యాఖ్యానించారు. బాధితులపైనే బాధ్యత నెట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలను చిన్మయి తప్పుబట్టారు.

సినీ పరిశ్రమలో 'కమిట్‌మెంట్' అనే పదానికి ఉన్న అసలు అర్థాన్ని చిన్మయి బయటపెట్టారు. "చదువుకున్న అమ్మాయిలు వృత్తి పట్ల నిబద్ధతను కమిట్‌మెంట్ అని భావిస్తారు. కానీ ఇక్కడ కమిట్‌మెంట్ అంటే లైంగికంగా లొంగిపోవడమని అర్థం. అలా లొంగిపోకపోతే అవకాశాలు నిరాకరిస్తారు. అవకాశాలు ఇస్తున్నాం కాబట్టి మహిళలు తమకు సెక్స్ పరంగా సహకరించాలని భావించే పురుషులే ఇక్కడ అసలైన సమస్య," అని ఆమె తన ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్‌లో పేర్కొన్నారు.

తనపై జరిగిన లైంగిక వేధింపులను మరోసారి ప్రస్తావిస్తూ చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. "నేను వైరముత్తు చేతిలో వేధింపులకు గురైంది నా ప్రవర్తన వల్ల కాదు. అప్పుడు నాకు కనీసం 20 ఏళ్లు కూడా నిండలేదు. ఒక గురువుగా ఆయనను గౌరవించాను. మా అమ్మ పక్కనే ఉన్నా ఆయన నన్ను వేధించారు. తలిదండ్రులు పక్కన ఉన్నా సరే, ఇలాంటి మృగాలను ఏదీ ఆపదు" అని ఆమె కుండబద్దలు కొట్టారు. అలాగే, ఒక గాయని స్టూడియోలో వేధింపులకు గురై సౌండ్ బూత్‌లో దాక్కున్న ఉదంతాన్ని, మరో సింగర్ అసభ్యకర ఫోటోలు పంపిన ఘటనలను ఆమె ఉదాహరణలుగా వివరించారు.

చిరంజీవి వ్యాఖ్యలను విశ్లేషిస్తూ.. "లెజెండరీ చిరంజీవి గారు ఒక గొప్ప తరం నుంచి వచ్చారు. ఆ రోజుల్లో సహ నటీమణులతో స్నేహం, పరస్పర గౌరవం ఉండేవి. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరుగా ఉన్నాయి" అని చిన్మయి అభిప్రాయపడ్డారు. అలాగే గతంలో 'మీటూ' ఉద్యమంపై నటి సౌకార్ జానకి వంటి వారు చేసిన వ్యాఖ్యలను కూడా ఆమె విమర్శించారు. బాధితులు గొంతు విప్పితే అది వారి కుటుంబాలకు అవమానం అని భావించే ఆలోచనా ధోరణి మారాలని ఆమె కోరారు.

చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. బాధితులను నిందించే విధంగా ఆయన మాట్లాడటం సరికాదని నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags:    

Similar News