Confusion Around Ellamma Ends: ఎల్లమ్మ గందరగోళానికి తెర: వేణు సినిమాకు హీరో ఫిక్స్

వేణు సినిమాకు హీరో ఫిక్స్

Update: 2025-12-01 07:05 GMT

Confusion Around Ellamma Ends: బలగం చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు రూపొందించబోతున్న తదుపరి చిత్రం ఎల్లమ్మ ప్రాజెక్ట్‌పై గత రెండేళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. ఈ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలుకుతూ చిత్ర నిర్మాత దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. గోవాలో జరుగుతున్న 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

హీరో ఫైనల్, హీరోయిన్ ప్రకటన త్వరలో

‘‘ఎల్లమ్మ సినిమాకు హీరో ఫైనల్ అయ్యాడు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తాం. అలాగే ఈ నెలలోనే హీరోయిన్ వివరాలను కూడా ప్రకటిస్తాం’’ అని దిల్ రాజు స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కొనసాగుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో పెరిగింది. నిజానికి ఎల్లమ్మ సినిమాను ప్రకటించినప్పుడు మొదట హీరో నాని పేరును ప్రకటించి ఫస్ట్‌లుక్‌ కూడా విడుదల చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత శర్వానంద్, నితిన్ పేర్లు ప్రముఖంగా వినిపించినా, వారు కూడా ఈ సినిమా నుంచి వైదొలిగారు. ఇలా ముగ్గురు అగ్ర హీరోలు మారడంతో సినిమా అసలు ఉంటుందా? లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి.

తాజా ప్రకటనతో ఇప్పుడు ఆ కొత్త హీరో ఎవరు అనే దానిపై సినీ వర్గాలలో ప్రేక్షకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమ నిర్మాణ సంస్థ ప్రణాళికల గురించి దిల్ రాజు వివరిస్తూ, తమ బ్యానర్‌లో 2026లో ఆరు సినిమాలు విడుదల కానున్నాయని తెలిపారు. ప్రస్తుతం రౌడీ జనార్దన్ అనే సినిమా షూటింగ్ జరుగుతోందని ఆయన వివరించారు.

Tags:    

Similar News