Cricket God Sachin Tendulkar: తమన్ బ్యాటింగ్‌కు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు...

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు...

Update: 2025-10-07 02:31 GMT

Cricket God Sachin Tendulkar: ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీనికి కారణం క్రికెట్ దేవుడిగా అభిమానులు పిలుచుకునే దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ స్వయంగా ఆయన బ్యాటింగ్‌ను ప్రశంసించడమే. డల్లాస్ నుంచి దుబాయ్ వెళ్లే విమానంలో సచిన్‌తో కలిసి ప్రయాణించే అరుదైన అవకాశం తమన్‌కు లభించింది. ఈ సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర సంభాషణను తమన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

సచిన్ మాటలతో తమన్ సంబరం

తన ఎక్స్ ఖాతాలో సచిన్‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన తమన్.. తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. "క్రికెట్ దేవుడు, లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి ప్రయాణిస్తున్నాను. డల్లాస్ నుంచి దుబాయ్ వరకు ప్రయాణంలో మంచి సమయం గడిపాను. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లలో నా బ్యాటింగ్ క్లిప్స్‌ను ఆయనకు చూపించాను. అది చూసిన మాస్టర్.. మీకు అద్భుతమైన బ్యాట్ స్పీడ్ ఉంది అని అన్నారు. ఇక నా ఆనందం మాటల్లో చెప్పలేనిది" అని తమన్ తెలిపారు. భవిష్యత్తులో సచిన్‌తో కలిసి పనిచేసే అవకాశం రావచ్చు అని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలుగు వారియర్స్ తరపున తమన్ మెరుపులు

సంగీతంతో పాటు క్రికెట్‌ అంటే తమన్‌కు ఎంత ఇష్టమో తెలిసిందే. ఆయన సీసీఎల్‌లో తెలుగు వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, తన ధాటియైన బ్యాటింగ్‌తో జట్టును చాలాసార్లు గెలిపించారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ చిత్ర విజయానందంలో ఉన్న తమన్, చేతిలో అఖండ 2: తాండవం, ప్రభాస్ ది రాజా సాబ్ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఓజీ విజయంలో తమన్ సంగీతం ఒక స్తంభంలా నిలిచిందని దర్శకుడు సుజీత్ ప్రశంసించడం విశేషం.

తిరిగి నటనలోకి

బాయ్స్ సినిమాతో నటుడిగా పరిచయమైన తమన్, చాలా కాలం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు. అథర్వ హీరోగా ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇదయం మురళి అనే తమిళ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tags:    

Similar News