‘Peddi’ Mania: మైత్రీ-దిల్ రాజు మధ్య కుదిరిన డీల్.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో పెద్ది సందడి ఖాయం

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో పెద్ది సందడి ఖాయం

Update: 2026-06-01 12:03 GMT


‘Peddi’ Mania: మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం పెద్ది విడుదలపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన నైజాం థియేటర్ల వివాదం పూర్తిగా పరిష్కారమవడంతో, సినిమా అత్యంత భారీ స్థాయిలో గ్రాండ్ రిలీజ్ అయ్యేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.

ముఖ్యంగా నైజాం ఏరియా కింగ్, ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ థియేటర్లలో పెద్ది విడుదలవుతుందా? లేదా? అనే అనుమానాలకు తాజా ఒప్పందంతో చెక్ పడింది.

అసలు వివాదం ఏంటి? ఎందుకు ఉత్కంఠ నెలకొంది?

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ విషయంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య రెంటల్ , పర్సెంటేజ్ పద్ధతులపై కొన్ని విభేదాలు తలెత్తాయి. దీనికి తోడు నైజాంలో టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలైన ఎస్వీసీ, మైత్రీ డిస్ట్రిబ్యూషన్ల మధ్య ఉన్న వ్యాపార పోటీ కూడా దీనికి కారణమని ప్రచారం జరిగింది.

ఆదివారం విడుదల చేసిన నైజాం థియేటర్ల మొదటి లిస్టులో దిల్ రాజుకు చెందిన సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌ల పేర్లు లేకపోవడంతో మెగా అభిమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. థియేటర్ల సంఖ్య తగ్గితే ఓపెనింగ్స్ దెబ్బతింటాయని ట్రేడ్ వర్గాలు కూడా భావించాయి.

టాప్ ప్రొడ్యూసర్స్ చర్చలు సక్సెస్.. థియేటర్లు ఖరారు..

పరిస్థితి తీవ్రతను గమనించిన ఇరు వర్గాల పెద్దలు తాజాగా జరిపిన చర్చలు ఫలించాయి. విభేదాలను పక్కనపెట్టి సినిమా పరిశ్రమ హితం కోసం ఇరు సంస్థలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ డీల్‌తో నైజాం ప్రాంతంలోని ఎస్వీసీ సంస్థకు చెందిన అన్ని ప్రధాన థియేటర్లలో పెద్ది భారీ ఎత్తున విడుదల కానుంది. హైదరాబాద్‌ సినీ అడ్డా అయిన ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని ప్రఖ్యాత సుదర్శన్, దేవి థియేటర్ కాంప్లెక్స్‌లలో కూడా పెద్ది ప్రదర్శన ఖాయమైంది. దీంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నైజాం ఏరియాలో ఇంతటి భారీ థియేటర్ల సంఖ్యతో విడుదలవుతున్న హిస్టారికల్ సినిమా ఇదేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వంపైనే అందరి దృష్టి..

థియేటర్ల సమస్య ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి టికెట్ ధరలపైనే ఉంది. తెలంగాణలో అదనపు షోలు, అలాగే టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇవ్వాలంటూ చిత్ర నిర్మాతలు ఆల్రెడీ ప్రభుత్వాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే గనుక, సినిమా మొదటి వారం బాక్సాఫీస్ వసూళ్లపై అది చాలా సానుకూల ప్రభావం చూపడం ఖాయం.

ఈ ఏడాది సమ్మర్ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల హడావుడి లేకపోవడంతో థియేటర్లు కాస్త వెలవెలబోయాయి. ఆ వెలితిని పూడుస్తూ, భారీ అంచనాలతో వస్తున్న పెద్ది చిత్రం టాలీవుడ్‌కు కొత్త ఊపును, రికార్డుల వేటను తీసుకువస్తుందని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

Tags:    

Similar News