Deva Katta Clarifies: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'వెన్నెల' వంటి విభిన్న చిత్రంతో ప్రయాణం మొదలుపెట్టి, ఆపై 'ప్రస్థానం', 'రిపబ్లిక్' వంటి సామాజిక., రాజకీయ ప్రాధాన్యత ఉన్న చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు దేవా కట్టా. ఇటీవల ఆయన పవన్ కళ్యాణ్‌కు ఒక రాజకీయ నేపథ్యంలో సాగే కథను వినిపించారని, త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలపై దేవా కట్టా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అన్ని పుకార్లకు చెక్ పెట్టారు.

పవన్ కళ్యాణ్ వంటి అగ్ర నటుడితో పని చేయడం ఎప్పుడూ తనకొక పెద్ద కల అని పేర్కొంటూనే, ప్రస్తుతానికి తమ మధ్య అటువంటి చర్చలు ఏవీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. "ఈ రూమర్ ఎవరు మొదలుపెట్టారో తెలియదు కానీ, పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయడం నా చిరకాల వాంఛ. నిజానికి 'రిపబ్లిక్' కథను కూడా ప్రారంభ దశలో ఆయన కోసమే సిద్ధం చేశాను. మా ఇద్దరినీ సమానంగా ఉత్సాహపరిచే ఒక కథ దొరికినప్పుడు తప్పకుండా మా కాంబినేషన్లో సినిమా వస్తుంది" అని దేవా కట్టా వివరించారు. ఈ వివరణతో పవన్ ఫ్యాన్స్‌లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.

అంతేకాకుండా, తాను కేవలం పొలిటికల్ డ్రామాలకే పరిమితం కావడం లేదని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఒక అద్భుతమైన ప్రతిభావంతుడితో కలిసి పూర్తిస్థాయి 'నాన్-పొలిటికల్' స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయేతర అంశాలతో కూడిన ఒక భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెరకెక్కించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. మరోవైపు, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి' కి దేవా కట్టా సంభాషణలు అందిస్తుండటం విశేషం. వీటితో పాటు ఒక యువ హీరోతో కూడా ఆయన కొత్త సినిమా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Tags: