Salman Khan’s Birthday Celebrations: సల్మాన్ ఖాన్ పుట్టినరోజు వేడుకల్లో ధోనీ సందడి

వేడుకల్లో ధోనీ సందడి

Update: 2025-12-27 05:47 GMT

Salman Khan’s Birthday Celebrations: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకల్లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సందడి చేశారు. డిసెంబర్ 27న పన్వెల్‌లోని సల్మాన్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ మెగా సెలబ్రేషన్స్‌కు ధోనీ తన భార్య సాక్షి, కుమార్తె జీవాతో కలిసి హాజరయ్యారు. ఈ వేడుకలో సల్మాన్, ధోనీ కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇద్దరు దిగ్గజాలను ఒకే ఫ్రేమ్‌లో చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు.

మరోవైపు, ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున మళ్ళీ బరిలోకి దిగనున్నారు. 44 ఏళ్ల వయస్సులోనూ ఆయన తన ఫిట్‌నెస్‌తో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. గత 2025 సీజన్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా టోర్నీకి దూరం కావడంతో, ధోనీ జట్టు పగ్గాలను అందుకున్నారు. అయితే, ఆ సీజన్ CSK చరిత్రలోనే అత్యంత దారుణమైనదిగా నిలిచింది. పాయింట్ల పట్టికలో తొలిసారిగా చెన్నై ఆఖరి స్థానంలో నిలవడం అభిమానులను నిరాశకు గురిచేసింది.

వచ్చే సీజన్ కోసం CSK భారీ మార్పులు చేస్తోంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శామ్సన్‌ను ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తీసుకుంది. ఇందుకు ప్రతిగా రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను వదులుకుంది. అలాగే, యువ వికెట్ కీపర్ కార్తీక్ శర్మను రికార్డు స్థాయిలో రూ. 14.20 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

ధోనీ రిటైర్మెంట్‌పై మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. CSK ప్రస్తుతం భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, 2026 సీజన్ ధోనీకి ఖచ్చితంగా ఆఖరిది అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, తన చివరి సీజన్‌లో చెన్నైని మరోసారి ఛాంపియన్‌గా నిలిపి ధోనీ ఘనంగా వీడ్కోలు పలుకుతారా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News