Director Sudha Kongara: హైకోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర.. రూ. 8 కోట్లకు పైగా రెమ్యునరేషన్ బాకీ

రెమ్యునరేషన్ బాకీ

Update: 2026-07-01 04:15 GMT

Director Sudha Kongara: గురు, ఆకాశం నీ హద్దు రా వంటి చిత్రాలతో టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ సుధా కొంగర మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తాను దర్శకత్వం వహించిన ‘పరాశక్తి’ సినిమాకు సంబంధించి రావలసిన రూ. 8.39 కోట్ల రెమ్యునరేషన్ బకాయిలను ఇంకా చెల్లించలేదని ఆమె కోర్టు మెట్లెక్కారు. ఒప్పందం ప్రకారం తనకు రావాల్సిన డబ్బులు అందలేదని పేర్కొంటూ.. నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న తదుపరి తమిళ సినిమా విడుదలపై స్టే విధించాలని ఆమె కోర్టును కోరారు.

శివకార్తికేయన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో సుధా కొంగర తెరకెక్కించిన ‘పరాశక్తి’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి (పొంగల్ 2026) కానుకగా థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది, కమర్షియల్‌గా పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తనకు రావాల్సిన పారితోషికం ఇవ్వకపోవడంతో సుధా కొంగర న్యాయపోరాటానికి దిగారు.

తెలుగు మూలాలున్న కుటుంబం నుండి వచ్చిన సుధా కొంగర.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి, ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకురాలిగా ఎదిగారు. వెంకటేష్‌తో ఆమె తీసిన ‘గురు’, సూర్యతో తీసిన ‘ఆకాశం నీ హద్దు రా’ (సూరరై పోట్రు) సినిమాలు తెలుగులోనూ ఆమెకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆమె ఎదుర్కొంటున్న ఈ రెమ్యునరేషన్ వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సదరు నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ‘ఇదయం మురళి’ అనే కొత్త సినిమా విడుదలను, తన పేమెంట్ వివాదం తేలే వరకు నిలిపివేయాలంటూ ఆమె హైకోర్టును గట్టిగా ఆశ్రయించారు. మరి ఈ వివాదంపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News