Maa Inti Bangaram Sequel: మా ఇంటి బంగారం సీక్వెల్ ప్రకటనతో సమంత అభిమానులకు డబుల్ ధమాకా..
డబుల్ ధమాకా..
Maa Inti Bangaram Sequel: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్-డ్రామా మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. జూన్ 19న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా, చిత్ర బృందం వైజాగ్‌లో గ్రాండ్‌గా విజయోత్సవ వేడుకను నిర్వహించింది. శుక్రవారం సాయంత్రం ఆర్‌కే బీచ్ సమీపంలోని గోకుల్ పార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు పోటెత్తారు.
త్వరలోనే మా ఇంటి బంగారం సీక్వెల్..
ఈ వేడుక వేదికగా నిర్మాత రాజ్ నిడిమోరు అభిమానులకు ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ ఉండబోతోందని ఆయన అధికారికంగా ప్రకటించడంతో గోకుల్ పార్క్ అభిమానుల కేరింతలతో మారుమోగిపోయింది.
నా భర్త ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది: సమంత భావోద్వేగం
ఈ సందర్భంగా నటి సమంత మాట్లాడుతూ, సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. "సినిమా విడుదలకు ముందు ఫలితం ఎలా ఉంటుందోనని కాస్త ఆందోళన పడ్డాను. కానీ ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు నాలో ఎంతో సంతోషాన్ని నింపింది. ముఖ్యంగా నా అనారోగ్యం తర్వాత నేను మళ్లీ కెమెరా ముందుకు రావడానికి, సినిమాల్లో నటించడానికి నా భర్త, నిర్మాత రాజ్ నిడిమోరు అందించిన ప్రోత్సాహం, మద్దతు ఎప్పటికీ మరువలేనిది" అని పేర్కొన్నారు. అలాగే వైజాగ్ ప్రజలు తనపై చూపే ప్రత్యేక ప్రేమాభిమానాలను ఆమె గుర్తుచేసుకున్నారు.
సమంతకు మంగళ హారతులు:
ప్రస్తుతం గర్భవతిగా ఉన్న సమంతకు వైజాగ్‌కు చెందిన మహిళలు వేదికపై సాంప్రదాయబద్ధంగా మంగళ హారతులు ఇచ్చి, దీవెనలు అందించడం ఈ వేడుకలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయోత్సవ ఆనందంలోనూ చిత్ర బృందం సామాజిక బాధ్యతను చాటుకుంది. పోలీసుల సమక్షంలో నో డ్రగ్స్, ఎడ్యుకేషన్ ఈజ్ ప్రెషియస్ అనే అవగాహన బ్యానర్‌ను సమంత ఆవిష్కరించారు.
సమంత నటనే సినిమా బలం:
దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ, వైవిధ్యమైన కథలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. సమంత అందించిన అద్భుతమైన నటనే ఈ సినిమా విజయానికి ప్రధాన బలమని కొనియాడారు.