Shakeela: అతిగా స్మార్ట్‌ఫోన్ వాడితే జరిగే అనర్థం ఇదే.. షకీలా షాకింగ్ అనుభవం!
షకీలా షాకింగ్ అనుభవం!
Shakeela: మనం నిత్యం చేతిలో పట్టుకునే స్మార్ట్‌ఫోన్ మన ప్రాణాల మీదికి తెస్తుందంటే నమ్ముతారా? కేవలం ఫోన్ వాడకం వల్ల ఒక ప్రముఖ నటి తీవ్రమైన అనారోగ్యానికి గురై, ఏకంగా మూడు లక్షలు ఖర్చు పెట్టి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది! ఆ నటి ఎవరో కాదు.. ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపిన సీనియర్ నటి షకీలా
తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా షకీలా తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన నిజాలను అభిమానులతో పంచుకున్నారు. తాను పడుకునే భంగిమలో చేసిన చిన్న పొరపాటే తన కొంపముంచిందని ఆమె తెలిపారు. మంచంపై పక్కకు తిరిగి పడుకుని, గంటల తరబడి మొబైల్ గేమ్స్ ఆడటం, సోషల్ మీడియాలో రీల్స్ చూడటం వంటి అలవాట్లే తన మెడలోని ప్రధాన నరాలను దెబ్బతీశాయని ఆమె వాపోయారు. కేవలం టీ తాగి మళ్లీ ఫోన్‌లో మునిగిపోవడం వల్ల పరిస్థితి చేయి దాటిందని, చివరికి సర్జరీ టేబుల్ ఎక్కాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు.
ప్రస్తుతం ఈ సర్జరీ కోసం తనకు మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు అయిందని, కనీసం మంచం దిగాలన్నా, తినాలన్నా ఇంకొకరి సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని షకీలా ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ అనేది అవసరం మేరకు మాత్రమే వాడాలని, పిల్లలకు అస్సలు ఫోన్లు ఇవ్వవద్దని ఆమె తల్లిదండ్రులను గట్టిగా హెచ్చరించారు. ఏది ఏమైనప్పటికీ, షకీలా చెప్పిన ఈ ఉదంతం స్మార్ట్‌ఫోన్లకు బానిసైన నేటి తరానికి కనువిప్పు కలిగించేలా ఉంది.