Jr NTR: ఆసుపత్రి నుంచి డిశ్చార్జైన జూనియర్ ఎన్టీఆర్.... వైద్యులు ఏమన్నారంటే?
వైద్యులు ఏమన్నారంటే?
Jr NTR: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా భుజం నొప్పితో బాధపడుతున్న తారక్, సికింద్రాబాద్‌లోని ప్రముఖ కిమ్స్ ఆసుపత్రిలో విజయవంతంగా సర్జరీ పూర్తి చేసుకుని గురువారం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ప్రకటించడంతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
కొంతకాలంగా భుజానికి తగిలిన గాయం కారణంగా ఎన్టీఆర్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి,డాక్టర్ నితిన్ బెజ్జంకిల ఆధ్వర్యంలో నిపుణుల బృందం ఆయనకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించింది. అనంతరం భుజానికి సంబంధించిన 'ఆర్థోస్కోపిక్ శస్త్రచికిత్స'ను (Arthroscopic Surgery) అత్యంత విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ఒక అధికారిక మెడికల్ బులెటిన్‌ను విడుదల చేశాయి.
సర్జరీ విజయవంతం కావడంతో ఎన్టీఆర్ కోలుకున్నారని, గురువారమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు కిమ్స్ మెడికల్ సర్వీస్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ సంబిత్ సాహూ తెలిపారు. ప్రస్తుతం తారక్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. త్వరలోనే ఆయన పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. తారక్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.