Telugu Film Industry : ప్రభుత్వ జోక్యంతో ముగిసిన ఫిల్మ్‌ ఫెడరేషన్‌ సమ్మె

లేబర్‌ కమిషనర్‌ గంగాధర్‌ నేతృత్వంలో ఫెడరేషన్‌, నిర్మాతల మధ్య జరిగిన చర్చలు సఫలం;

Update: 2025-08-22 06:21 GMT

మొత్తానికి ప్రభుత్వం కలగజేసుకుని తెలుగు ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌, నిర్మాతల మండలిల మధ్య సయోధ్య కుదిర్చింది. గడచిన రెండు వారాలకు పైబడి ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చేస్తున్న సమ్మెకు శుభంకార్డు పడింది. చాలా రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో తెలుగు సినిమాల షూటింగులు నిలిచిపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కలగజేసుకుని ఫెడరేషన్‌, నిర్మాతల మండలిల మధ్య సమస్యను త్వరగా పరిష్కరించమని తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌రాజు, లేబర్‌ కమిషనర్‌ గంగాధర్‌లను ఆదేశించారు. దీంతో లేబర్‌ కమిషనర్‌ గంగాధార్‌ నేతృత్వంలో ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌, నిర్మాతల మండలిల మధ్య చర్చలు నిర్వహించి వాటిని సఫలం చేశారు. మొత్తంగా 22.5 శాతం వేతనం పెంపుకు ఇరు పక్షాల మధ్యా లేబర్‌ కమిషనర్‌ సమక్షంలో అంగీకారం కుదిరింది. ఇందులో మొదటి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం వేతనాలు పెంచి ఇచ్చేలా ఒప్పందం అయ్యింది. దీనిపై టిజీఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, లేబర్‌ కమిషనర్‌ గంగాధర్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్‌ని ఫిల్మ్‌ హబ్‌గా చేయాలని సీయం రేవంత్‌రెడ్డి ఉద్దేశమని, ఆ దిశగా తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకు వెళుతుందని దిల్‌రాజు చెప్పారు. ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ మాట్లాడుతూ నిర్మాత మండలి ఫెడరేషన్‌ సమస్యను అర్ధం చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే చర్చల సఫలం అయ్యేలా చూసినందుకు లేబర్‌ కమిషన్‌ర్‌ గంగాధర్‌కి కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పారు. లేబర్‌ కమిషనర్‌ గంగాధర్‌ మాట్లాడుతూ 30 శాతం హైక్‌ అనేది జరుగుతుందన్నారు. మూడు నాలుగు షరతులపై ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. కండీషన్లపై ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తున్నామని నెల రోజుల్లో కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. సినీ కార్మికుల సమ్మె ఇక ముగిసినట్లే అని రేపటి నుంచి షూటింగులు కొనసాగుతాయని గంగాధర్‌ స్పష్టం చేశారు.

సీయం రేవంత్‌రెడ్డికి చిరంజీవి కృతజ్ఞతలు

ఎంతో జ‌టిల‌మైన‌ ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ను చాలా సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా పరిష్కరించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మెగాస్టార్‌ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఇటు నిర్మాత‌లకు, అటు కార్మికులకు స‌మ‌న్యాయం జ‌రిగే విధంగా ప‌రిష్క‌రించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు చిత్ర‌సీమ అభివృద్ధికి ముఖ్య‌మంత్రి తీసుకొంటున్న చ‌ర్య‌లు అభినంద‌నీయమని చిరంజీవి అన్నారు. హైద‌రాబాద్ ను దేశానికే కాదు, ప్ర‌పంచ చ‌ల‌న చిత్ర రంగానికే ఓ హ‌బ్ గా మార్చాల‌న్న ఆయ‌న ఆలోచ‌న‌లు, అందుకు చేస్తున్న కృషి హ‌ర్షించ‌ద‌గిన‌వన్నారు. తెలుగు చిత్ర‌సీమ ఇలానే క‌లిసి మెలిసి ముందుకు సాగాల‌ని, ప్ర‌భుత్వం కూడా అన్ని ర‌కాలుగా అండ‌దండ‌లు అందిస్తుంద‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకొంటున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు.

Tags:    

Similar News