Anupama Parameswaran’s Lockdown: ఎట్టకేలకు మోక్షం: జనవరి 30న అనుపమ పరమేశ్వరన్ లాక్‌డౌన్ విడుదల
అనుపమ పరమేశ్వరన్ లాక్‌డౌన్ విడుదల
Anupama Parameswaran’s Lockdown: మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను అలరించేందుకు మరోసారి సిద్ధమయ్యారు. ఏఆర్ జీవా దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా లాక్‌డౌన్ విడుదల తేదీని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ఖరారు చేసింది. ఈ చిత్రం జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆలస్యం
నిజానికి ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 5 విడుదల కావాల్సి ఉంది. అయితే అప్పట్లో చెన్నై, తమిళనాడు వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు దిత్వా తుపాను సృష్టించిన భీభత్సం వల్ల చిత్రబృందం వెనక్కి తగ్గింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అప్పట్లో వాయిదా వేసిన మేకర్స్, ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
కథా నేపథ్యం: లాక్‌డౌన్‌లో ఒక యువతి పోరాటం
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో అనుపమ అనిత అనే మధ్యతరగతి యువతి పాత్రలో నటించారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, బయట అప్పుల కోసం ఆమె చేసే పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చార్లీ, నిరోషా, లివింగ్‌స్టన్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఎన్ఆర్ రఘునందన్, సిద్ధార్థ్ విపిన్ ఈ చిత్రానికి స్వరాలు అందించారు.
అంచనాలు - సెన్సార్ అప్‌డేట్
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను పెంచింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. కార్తికేయ-2, టిల్లు స్క్వేర్ వంటి భారీ విజయాల తర్వాత అనుపమ ఒక సీరియస్ రోల్‌లో కనిపిస్తుండటంతో ఈ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.