Aditi Rao Hydari: అదితి రావు హైదరి పేరుతో మోసం!
హైదరి పేరుతో మోసం!
Aditi Rao Hydari: ప్రముఖ నటి అదితి రావు హైదరి తన పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారంటూ సంచలన ప్రకటన చేశారు. తన ఫోటో, పేరును ఉపయోగించి ఒక నకిలీ వాట్సాప్ అకౌంట్ ద్వారా సినీ పరిశ్రమకు చెందిన ఫొటోగ్రాఫర్‌లను, ఇతర నిపుణులను సంప్రదిస్తూ మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. నకిలీ అకౌంట్ ద్వారా ఫొటోషూట్‌లు లేదా ఇతర వృత్తిపరమైన అవకాశాల కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు అదితి దృష్టికి వచ్చింది. అదితి వెంటనే తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక స్టోరీ పోస్ట్ చేసి, అభిమానులు, పరిశ్రమ వర్గాలను అప్రమత్తం చేశారు. "వృత్తిపరమైన విషయాలు, ఫొటోషూట్‌లు లేదా మరేదైనా పనికి సంబంధించిన సంప్రదింపులు అన్నీ కేవలం నా అధికారిక బృందం ద్వారా మాత్రమే జరుగుతాయి. నకిలీ అకౌంట్‌లు, ఫేక్ నంబర్‌ల ద్వారా వచ్చే సందేశాలను నమ్మి ఎవరూ మోసపోవద్దు," అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. తాను లేదా తన బృందం అధికారికంగా సంప్రదించడానికి ఉపయోగించే ఏకైక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ arhconnect అని అదితి తెలిపారు. ఎవరికైనా ఇలాంటి నకిలీ మెసేజ్‌లు వస్తే, వెంటనే తమకు తెలియజేయాలని ఆమె కోరారు. ముంబై సినీ పరిశ్రమలో ప్రముఖులు, ముఖ్యంగా నటీనటుల పేరుతో ఇలాంటి మోసాలు జరగడం కొత్తేమీ కాదు. అదితి రావు హైదరి సకాలంలో స్పందించి, అభిమానులను హెచ్చరించడం ద్వారా మరికొందరు మోసపోకుండా నిరోధించగలిగారు.