Allari Naresh: ఇకపై రెండు కామెడీ సినిమాలు, ఒక సీరియస్ సినిమా చేస్తా: అల్లరి నరేష్
అల్లరి నరేష్
Allari Naresh: అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా హీరో అల్లరి నరేష్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించి చిత్ర విశేషాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత తన నుంచి ప్రేక్షకులు కోరుకునే పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ కథ కుదిరిందని తెలిపారు. ఇందులో హీరోకు ఓ డ్రామా కంపెనీ ఉంటుందని, ఏమాత్రం కష్టపడకుండా సినిమా హీరో అయిపోవాలనే రకం అతని పాత్ర అని వివరించారు. తన ముత్తాతల కాలం నాటి పుస్తకంలో ఒక ప్యాట్రన్ గీస్తే దేవతలు వచ్చి కోరికలు తీరుస్తారని నమ్మే హీరో.. దేవతల దీవెనలతో రాజమౌళి నెక్స్ట్ మూవీలో తానే హీరో కావాలని ప్రయత్నాలు చేస్తుంటాడని చెప్పారు.
ఇక ఆ ప్యాట్రన్ ఎలా గీశాడు, భూమిపైకి రంభ, ఊర్వశి, మేనక వచ్చాక ఏం జరిగిందనేదే ఈ సినిమా అసలు మజిలీ అని నరేష్ తెలిపారు. తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపడే క్లీన్, ఆర్గానిక్ కామెడీతో పాటు మంచి ఎమోషన్ కూడా ఈ చిత్రంలో ఉంటుందన్నారు. తండ్రి ఈవీవీ సత్యనారాయణ స్టైల్‌లో పెద్ద స్టార్ కాస్ట్‌తో ఈ సినిమా తెరకెక్కిందని, ఇందులో ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ చేసిన పాత్ర కడుపుబ్బా నవ్విస్తుందని పేర్కొన్నారు.
ఇంకా మాట్లాడుతూ.. ఇటీవల వరుసగా భారీ యాక్షన్ సినిమాలు వస్తుండటంతో ప్రేక్షకులు ఇలాంటి లైట్ హార్టెడ్ కామెడీ సినిమాలను కోరుకుంటున్నారని నరేష్ అభిప్రాయపడ్డారు. అందుకే ఇకపై తన కెరీర్‌లో రెండు కామెడీ సినిమాలు, ఒక సీరియస్ సినిమా చేస్తూ బ్యాలెన్స్ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను నటించిన ‘ఆల్కహాల్’ చిత్రం విడుదల సిద్ధంగా ఉందని, మరోవైపు ‘కనకదుర్గ’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని ఆయన వెల్లడించారు.