థియేటర్‌కు వెళ్లాలంటేనే భయమేస్తుంది.. తేజ ఆసక్తికర కామెంట్స్

తేజ ఆసక్తికర కామెంట్స్

Update: 2025-12-25 05:37 GMT

సినిమా థియేటర్లలో టికెట్ ధరల కంటే తినుబండారాల ధరలే సామాన్యుడికి గుదిబండగా మారాయని ప్రముఖ దర్శకుడు తేజ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టికెట్ ధరల హేతుబద్ధీకరణ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని సినీ పరిశ్రమ సమస్యలపై పలు కీలక సూచనలు చేశారు.

టికెట్ ధర కంటే పాప్‌కార్న్ రేటే ఎక్కువ!

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన తేజ.. థియేటర్లలో క్యాంటీన్ ధరల దోపిడీపై ఘాటుగా స్పందించారు. "నేను ప్రతి వారం సినిమా చూసే వ్యక్తిని కానీ ఇప్పుడు థియేటర్‌కు వెళ్లాలంటే భయమేస్తోంది. ఎందుకంటే పాప్‌కార్న్ లేకుండా నేను సినిమా చూడలేను. కానీ అక్కడ పాప్‌కార్న్ ధర టికెట్ ధర కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. ఈ రేట్లు కచ్చితంగా తగ్గాలి" అని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వ కమిటీ కీలక సమావేశం

హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ భేటీలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. దర్శకుడు తేజతో పాటు నిర్మాత వివేక్ కూచిబొట్ల, ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ అలంకార్ ప్రసాద్, డిస్ట్రిబ్యూటర్ సాయిబాబు తదితరులు హాజరయ్యారు. మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరల విధానం, భారీ బడ్జెట్ సినిమాలకు వెసులుబాటు వంటి అంశాలపై ప్రభుత్వం సలహాలు స్వీకరించింది.

పరిశ్రమకు, ప్రేక్షకులకు మధ్య సమతుల్యత

ప్రభుత్వం పేదలకు సినిమాను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోందని తేజ కొనియాడారు. "కథ రాసినప్పటి నుంచి సినిమాను థియేటర్ వరకు తీసుకెళ్లే అన్ని విభాగాల్లో నాకు అనుభవం ఉంది. అందుకే పరిశ్రమకు నష్టం కలగకుండా, ప్రేక్షకుడికి భారం కాకుండా ధరలను ఎలా సమన్వయం చేయాలనే దానిపై నా అభిప్రాయాలు చెప్పాను" అని ఆయన తెలిపారు.

Tags:    

Similar News