Akhand 2: గుడ్ న్యూస్: 'అఖండ 2' విడుదలకు లైన్ క్లియర్!

'అఖండ 2' విడుదలకు లైన్ క్లియర్!

Update: 2025-12-09 12:04 GMT

Akhand 2: నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు శుభవార్త. ఎంతో ఉత్కంఠ రేపిన 'అఖండ 2: తాండవం' చిత్రం విడుదలపై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. మద్రాస్ హైకోర్టులో దాఖలైన కేసులో ఆర్థిక వివాదాలు పరిష్కారం కావడంతో, సినిమా విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ వారం సినిమా థియేటర్లలోకి రావడం దాదాపు ఖాయమైంది.

ఈ సినిమా విడుదల తేదీ డిసెంబర్ 5న ఉండగా, కేవలం కొన్ని గంటల ముందు మద్రాస్ హైకోర్టు అనూహ్యంగా స్టే విధించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. నిర్మాత సంస్థ 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తమకు చెల్లించాల్సిన సుమారు ₹28 కోట్లు బకాయిలు చెల్లించే వరకు సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు, ఈరోస్ సంస్థకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే, ఈ స్టే కారణంగా విడుదల వాయిదా పడటంతో, 14 రీల్స్ ప్లస్ మరియు ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థలు సినిమా పెద్దల సహకారంతో కోర్టు వెలుపల చర్చలు జరిపాయి. సుదీర్ఘ చర్చల అనంతరం ఇరు పక్షాలు సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకున్నాయి. ఈ పరిష్కారాన్ని న్యాయస్థానానికి తెలియజేయడంతో, 'అఖండ 2' విడుదలకు అడ్డంకిగా ఉన్న స్టేను మద్రాస్ హైకోర్టు ఎత్తివేసింది.

కోర్టు క్లియరెన్స్ రావడంతో, సినిమా యూనిట్ కొత్త విడుదల తేదీని ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. తాజా సమాచారం ప్రకారం, డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, డిసెంబర్ 11 రాత్రి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రం వెలువడే అవకాశం ఉంది.

Tags:    

Similar News