“Governor: The Silent Saviour”: పొలిటికల్ థ్రిల్లర్ గవర్నర్..ది సైలెంట్ సేవియర్
ది సైలెంట్ సేవియర్
“Governor: The Silent Saviour”: బాలీవుడ్‌లో విలక్షణ నటనకు మారుపేరు మనోజ్ బాజ్‌పాయ్. ఆయన నుంచి సినిమా వస్తుందంటేనే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ.. దేశ ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ సిద్ధమైంది. అదే 'గవర్నర్'. 'ది సైలెంట్ సేవియర్' అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన ప్రీ-లుక్ పోస్టర్లు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి."
విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లను గమనిస్తే.. ఇది ఒక సాదాసీదా సినిమా కాదని అర్థమవుతోంది. ఒక గ్రీన్ కలర్ కుర్చీ, దాని ముందు టేబుల్‌పై ఉన్న కొన్ని ఫైల్స్, గోడపై ఆర్‌బీఐ (RBI) సింబల్.. ఇవన్నీ కథలోని గాంభీర్యాన్ని సూచిస్తున్నాయి. 'భారత్ దివాలా అంచున ఉంది.. ఇది కుర్చీ కాదు ఓ బాధ్యత' అని పోస్టర్‌పై రాసి ఉన్న వాక్యాలు సినిమాపై విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో ఇందులో చూపించబోతున్నారు.
మరో పోస్టర్‌లో లెదర్ సూట్‌కేస్ పట్టుకుని మనోజ్ బాజ్‌పాయ్ నడిచి వెళ్తుండగా.. ‘నేను ఫెయిల్ అయితే భారతదేశం మొత్తం ఫెయిల్ అవుతుంది’ అని రాసి ఉన్న డైలాగ్ సినిమాపై హైప్‌ను పెంచేసింది. భారతదేశం ఒక ప్రపంచ శక్తిగా ఎదగడానికి కారణమైన ఒక అజ్ఞాత వీరుడి కథ ఇది. ఇది ఒక బయోపిక్ అని ప్రచారం జరుగుతోంది, కానీ అది ఎవరి జీవిత చరిత్ర అనేది మాత్రం మేకర్స్ ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు. 'ది కేరళ స్టోరీ' వంటి సంచలన చిత్రాలను నిర్మించిన అమృత్ లాల్ షా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. చిన్మయ్ మాండ్లేకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో 'కేరళ స్టోరీ' ఫేమ్ అదా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. దేశభక్తి, బాధ్యత, పదునైన మైండ్ గేమ్ కలయికగా రాబోతున్న ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మన దేశ చరిత్రను మార్చిన ఆ అజ్ఞాత వీరుడు ఎవరు? ఆ కుర్చీలో కూర్చుని ఆయన దేశాన్ని ఎలా కాపాడారు? తెలియాలంటే జూన్ 12 వరకు వేచి చూడాల్సిందే.