Hollywood legend James Cameron: వారణాసి సెట్స్ కు వస్తా..కొన్ని షాట్స్ తీస్తా
కొన్ని షాట్స్ తీస్తా
Hollywood legend James Cameron: హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరూన్, ఎస్.ఎస్. రాజమౌళి మధ్య జరిగిన వర్చువల్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జేమ్స్ కామెరూన్ రూపొందించిన 'అవతార్: ఫైర్ అండ్ యాష్' (Avatar 3) సినిమా ప్రమోషన్లలో భాగంగా వీరిద్దరూ సుమారు 10 నిమిషాల పాటు ఆసక్తికరమైన విషయాలను చర్చించుకున్నారు.
కామెరూన్ మాట్లాడుతూ.. "నేను మీ వారణాసి షూటింగ్ సెట్స్‌కు రావొచ్చా? మీరు ఆ మ్యాజిక్‌ను ఎలా క్రియేట్ చేస్తారో దగ్గరుండి చూడాలని ఉంది" అని రాజమౌళిని అడిగారు.దీనికి రాజమౌళి ఎంతో ఆనందంగా స్పందిస్తూ.. "ఖచ్చితంగా సార్! మీరు రావడం మా టీమ్‌కే కాదు, మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమకే గొప్ప గౌరవం" అని ఆహ్వానించారు.కామెరూన్ ఒక అడుగు ముందుకు వేసి సరదాగా ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు "నేను మీ సెట్స్‌కు వచ్చి కెమెరా పట్టుకుని కొన్ని షాట్స్ తీస్తాను. మీ సినిమాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పనిచేస్తాను" అని అన్నారు. దీనికి రాజమౌళి ఆశ్చర్యపోయారు.
ఆర్‌ఆర్‌ఆర్ (RRR) సినిమాలో ఎన్టీఆర్ పులులతో పోరాడే సీన్ కామెరూన్‌కు బాగా నచ్చింది. అందుకే 'వారణాసి' గురించి మాట్లాడుతూ.. "పులులతో లేదా మరేదైనా క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు నాకు చెప్పు, నేను తప్పకుండా వస్తాను" అని నవ్వుతూ చెప్పారు.
జేమ్స్ కామెరూన్ పలువురు ప్రముఖులతో పాటు రాజమౌళికి 'అవతార్ 3' సినిమాను చూపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజమౌళి "ఈ సినిమా చూస్తున్నంత సేపు నేను ఒక చిన్న పిల్లాడిలా మారిపోయాను. అందులోని విజువల్స్ 'యాష్ పీపుల్' (Ash People) పాత్రలు అద్భుతం" అని కామెరూన్‌ను ప్రశంసించారు.భారత్‌లో 1.45 బిలియన్ల జనాభాలో ఈ సినిమాను మొదటగా చూసింది తానే కావడం గర్వంగా ఉందని రాజమౌళి పేర్కొన్నారు.
సినిమా మేకింగ్‌లో AI ప్రభావం గురించి కూడా వీరిద్దరూ చర్చించుకున్నారు. AI వల్ల పని సులభం కావొచ్చు కానీ, అది మనుషుల సృజనాత్మకతను దెబ్బతీయకూడదని ఇద్దరూ అభిప్రాయపడ్డారు.