‘Husharu 2’: 2018లో వచ్చిన యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘హుషారు’ సినిమాకు సీక్వెల్‌గా ‘హుషారు 2’ తెరకెక్కుతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మొదటి సినిమాకు కథ, దర్శకత్వం అందించిన శ్రీ హర్ష కొనుగంటి ఈ సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్రెండ్‌షిప్‌, యూత్‌ఫుల్‌ కామెడీ, సరదా సంఘటనలతో కొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

తాజాగా విడుదల చేసిన ‘హుషారు 2’ టైటిల్‌ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో ఐదుగురు స్నేహితులు కనిపిస్తుండగా.. వారి చుట్టూ బీర్‌ బాటిళ్లతో ఉన్న ఓ ట్రక్‌, భారీ పాము, తాబేలు, నిధి పెట్టె, ఓ ఫ్యాక్టరీ వంటివి కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్‌ చూస్తుంటే సముద్ర మథనం కాన్సెప్ట్‌ నుంచి స్ఫూర్తి తీసుకున్నట్లు అనిపిస్తోంది. దీంతో సినిమా కథ ఎలా ఉండబోతుందనే ఆసక్తి మొదలైంది.

‘హుషారు 2’ కథ ఐదుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. కోవిడ్‌ సమయంలో వారు తమ దగ్గర ఉన్నదంతా కోల్పోతారు. ఆ తర్వాత కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇందుకోసం చిత్తరగుంజ్‌ అనే ప్రాంతానికి వెళ్లి.. అగేవ్‌ మొక్కల ఆధారంగా టేకీలా తయారు చేసే వ్యాపారం మొదలుపెట్టాలని ప్లాన్‌ చేస్తారు.

అయితే కొత్త వ్యాపారంతో తమ జీవితాలను మార్చుకోవాలని ప్రయత్నించిన ఈ ఐదుగురు స్నేహితులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. వారి ప్రయత్నాలు ఎలాంటి గందరగోళానికి దారితీశాయి? చివరికి వారి జీవితం ఎలా మారింది? అనేదే సినిమాలో ఆసక్తికరంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో రాహుల్‌ రామకృష్ణ, అశోక్‌ గల్లా, రవి ఆంటోనీ, దినేశ్‌ తేజ్‌, శశిధర్‌ కొచర్లకోట, విధి యాదవ్‌, అభిజ్ఞ వుతులూరు, భగవాన్‌ తివారీ, జతిన్‌ గోస్వామి, రజాయ్‌ రోవన్‌ తదితరులు నటిస్తున్నారు.

ఇప్పటికే ‘హుషారు 2’ సినిమా షూటింగ్‌లోని కీలక షెడ్యూల్స్‌ పూర్తయ్యాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను ఏడాది చివర్లో థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని ప్రమోషనల్‌ కంటెంట్‌ను విడుదల చేయనున్నారు.

Tags: