Tabu: తరాలు మారినా ఆ మ్యాజిక్ తగ్గలేదు.. నిన్నే పెళ్లాడతా 30 ఏళ్లపై టబు ఎమోషనల్ పోస్ట్..
టబు ఎమోషనల్ పోస్ట్..
Tabu: తెలుగు సినీ చరిత్రలో కుటుంబ బంధాలు, ప్రేమకథలను సరికొత్త రీతిలో ఆవిష్కరించిన ఎవర్‌గ్రీన్ క్లాసిక్ 'నిన్నే పెళ్లాడతా'. కింగ్ అక్కినేని నాగార్జున, అందాల తార టబు జంటగా నటించిన ఈ కల్ట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ విడుదలై నేటికి దిగ్విజయంగా 30 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ మైలురాయి సందర్భంగా కథానాయిక టబు సోషల్ మీడియా వేదికగా నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
కాలపరీక్షకు నిలిచిన అద్భుతం: టబు
తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సినిమా షూటింగ్ నాటి అరుదైన చిత్రాలను పంచుకున్న టబు.. ఈ జర్నీపై ఎమోషనల్ అయ్యారు. "హృదయాలను కొల్లగొట్టిన ప్రేమకథ ఇది.. తరాలు మారుతున్నా తన మ్యాజిక్‌తో అలరిస్తూ, కాలపరీక్షకు నిలిచిన కథా చిత్రమిది. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తూనే ఉన్నాయి. మూడు దశాబ్దాల 'నిన్నే పెళ్లాడతా' అద్భుత ప్రస్థానాన్ని, ఆ మ్యాజిక్‌ను సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది" అంటూ రాసుకొచ్చారు. ఈ బంధం, కథ ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచే ఉంటాయని ఆమె పేర్కొన్నారు.
టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సెట్టర్
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మార్క్ టేకింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్వయంగా నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో శీనుగా నాగార్జున, మహాలక్ష్మి అలియాస్ పండుగా టబు తమ సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ముఖ్యంగా లక్ష్మి, చలపతి రావు, గిరిబాబు, చంద్రమోహన్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ, రవితేజ వంటి భారీ తారాగణం తమ నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. అప్పట్లో భారీ బాక్సాఫీస్ విజయాన్ని అందుకోవడమే కాకుండా, 1996 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది.
నేటికీ సజీవంగా సందీప్ చౌతా సంగీతం
ఈ సినిమాతోనే ప్రముఖ సంగీత దర్శకుడు సందీప్ చౌతా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆయన అందించిన సరికొత్త సౌండింగ్, మెలోడీలు మూడు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఫ్రెష్‌గానే వినిపిస్తాయి. తమిళంలో 'ఉన్నైయే కల్యాణం పన్నికిరేన్ గా, కన్నడలో ప్రీత్సోద్ తప్పాగా రీమేక్ అయిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ విశేష ఆదరణ దక్కించుకుంది. 30 ఏళ్ల మైలురాయి సందర్భంగా టబు పెట్టిన పోస్ట్‌పై స్పందిస్తున్న అభిమానులు.. "ఇప్పటికీ మా ఫేవరెట్ మూవీ ఇదే", "పండు పాత్రను ఎవరూ రీప్లేస్ చేయలేరు" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.