Rakul Preet Singh: తన పేరును ఆదాయపు పన్ను శాఖ సోదాలతో ముడిపెడుతూ వస్తున్న కథనాలపై ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తనిఖీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పిన ఆమె, వాస్తవాలు తెలుసుకోకుండా సంచలనం కోసం అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థలపై మండిపడ్డారు. సినీ నిర్మాత వాషు భగ్నానీ, పనోరమా స్టూడియోస్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్‌కు చెందిన ప్రాంగణాల్లో ముంబై ఐటీ విభాగం సోదాలు చేపట్టిందంటూ ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. సుమారు 12 ప్రాంతాల్లో జరిగిన ఈ తనిఖీల్లో విదేశీ లావాదేవీలు, సినిమా ఫైనాన్సింగ్ అంశాలపై ఆరా తీస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంలో తన పేరును ప్రధానంగా ప్రస్తావించడంపై రకుల్ సోషల్ మీడియా వేదికగా ఘాటు ప్రకటన విడుదల చేశారు.

ఆర్మీ కుటుంబం నుంచి వచ్చా.. కష్టపడి పైకొచ్చా..

తన ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ రకుల్ భావోద్వేగ ప్రకటన చేశారు. "నేను ఒక ఆర్మీ కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. నాకు ఇక్కడ ఎలాంటి గాడ్‌ఫాదర్లు లేరు. నా స్వశక్తితో, కష్టంతోనే ఈ స్థాయికి చేరుకున్నాను. బాధ్యతాయుతమైన పౌరురాలిగా 20 ఏళ్ల వయసు నుంచే క్రమం తప్పకుండా ట్యాక్స్‌లు చెల్లిస్తున్నాను. అలాంటిది నన్ను ఆర్థిక అవకతవకలతో ముడిపెట్టడం బాధాకరం" అని స్పష్టం చేశారు.

బినామీ ఆస్తులు, అక్రమ లావాదేవీలు లేవు

వ్యక్తిగతంగా గానీ, నిర్మాణ సంస్థల తరఫున గానీ ఎలాంటి అక్రమ విదేశీ లావాదేవీల్లో తాను భాగస్వామిని కాదని రకుల్ తేల్చిచెప్పారు. దేశంలో గానీ, విదేశాల్లో గానీ తనకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవని వివరించారు. ఎవరి దగ్గరా ఖరీదైన ఆస్తులను బహుమతులుగా తీసుకోలేదని, అసలు అలాంటి గిఫ్టులు తీసుకోకపోవడమే తన సిద్ధాంతమని పేర్కొన్నారు.

వార్తలు వెనక్కి తీసుకోండి.. మీడియాకు హితవు

టీఆర్పీలు, వ్యూస్ కోసం ఒకరి ప్రతిష్ఠను, కెరీర్‌ను దెబ్బతీయడం సరికాదని రకుల్ హితవు పలికారు. "మీడియా రంగంలో వ్యాపార ఒత్తిళ్లు ఉంటాయని నేను అర్థం చేసుకోగలను. కానీ వాస్తవాలను పక్కనపెట్టి తప్పుడు కథనాలు రాయడం సమంజసం కాదు. నాపై వచ్చిన దురుద్దేశపూర్వక కథనాలను వెంటనే వెనక్కి తీసుకుని, నిజాలను పాఠకులకు చెప్పాలి" అని ఆమె డిమాండ్ చేశారు.

Tags: