RGV: జాన్వీ డీప్‌ఫేక్ వీడియో..సహాయం కాదు ప్రచారం చేశారు.. సెలబ్రిటీల తీరుపై ఆర్జీవీ ఫైర్
ఆర్జీవీ ఫైర్
RGV: దేవర బ్యూటీ జాన్వీ కపూర్ డీప్‌ఫేక్ వీడియో వివాదంపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈ విషయంలో బాధితురాలికి అండగా నిలుస్తున్నామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సినీ ప్రముఖుల తీరును ఆర్జీవీ తీవ్రంగా తప్పుపట్టారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ 'చుట్టమల్లే' విజువల్స్‌తో జాన్వీ కపూర్‌పై రూపొందించిన అభ్యంతరకర డీప్‌ఫేక్ వీడియో నెట్టింట తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. అయితే, సెలబ్రిటీలు చేసిన ఈ పనే అసలు సమస్యగా మారిందని వర్మ కుండబద్దలు కొట్టారు.
తెలియని వాళ్లకు కూడా తెలిసేలా చేశారు..
సినీ ప్రముఖుల వరుస ట్వీట్లు, పోస్టుల వల్ల అసలు ఆ వీడియో గురించి తెలియని సాధారణ నెటిజన్లకు కూడా తెలిసిపోయిందని ఆర్జీవీ విశ్లేషించారు. సెలబ్రిటీల స్పందన వల్లే కోట్లాది మంది ఆ వీడియో కోసం ఆన్‌లైన్‌లో వెతికి చూసేలా చేశారని, ఇది బాధితురాలికి ఏమాత్రం మేలు చేయకపోగా మరింత తీరని నష్టం కలిగించిందని ఆయన అభిప్రాయపడ్డారు.
చేయాల్సింది అది కాదు.. చట్టం ఏం చెబుతోంది?
ఈ వ్యవహారంలో అసలు చేయాల్సిన పనిని సెలబ్రిటీలు విస్మరించారని వర్మ చురకలంటించారు:
నేరస్థుడిని పట్టుకోవాలి:
సైబర్ క్రైమ్ పోలీసుల సాయంతో ఆ నీచమైన వికృత చేష్టకు పాల్పడిన నిందితుడిని పట్టుకోవడమే అసలైన పరిష్కారం. వాడిని పట్టుకున్న తర్వాత ఆ విషయాన్ని ప్రచారం చేస్తే బాగుండేది.
బాధితురాలి గుర్తింపు బహిర్గతం చట్టరీత్యా నేరం:
అలా కాకుండా బాధితురాలి పేరును హైలైట్ చేస్తూ బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చట్టపరంగా కూడా నేరమేనని ఆయన గుర్తుచేశారు.
మొత్తంగా చూస్తే, సెలబ్రిటీలు న్యాయం కోసం గళం విప్పడం కంటే.. ఆ అసభ్యకరమైన వీడియోకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చి మరింత వైరల్ అయ్యేలా చేశారని ఆర్జీవీ తన మార్క్ లాజిక్‌తో తేల్చిచెప్పారు.