Anupama Parameswaran: చిత్రసీమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అత్యంత సంచలన విషయాలను పంచుకున్నారు. గతంలో తాను ఒక వ్యక్తితో ఉన్న రిలేషన్‌షిప్ వల్ల ఎదుర్కొన్న తీవ్ర మానసిక వేధింపుల గురించి ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో బహిరంగంగా మాట్లాడారు. ప్రేమ పేరుతో తన జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి నుంచి శారీరకంగా, మానసికంగా తీవ్ర నరకాన్ని అనుభవించానని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

నియంత్రణ.. ఆంక్షలు.. నిశ్చితార్థానికి ఒత్తిడి..

తన చేదు అనుభవాలను వివరిస్తూ.. "అతను ప్రేమ పేరుతో నన్ను పూర్తిగా తన కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ప్రయత్నించేవాడు. నేను వేసుకునే దుస్తుల నుంచి సోషల్ మీడియా పోస్టులు, చివరికి నేను నటించే సినిమాల ఎంపిక వరకు ప్రతి విషయంలోనూ ఆంక్షలు పెట్టేవాడు. సినిమాలకు స్వస్తి చెప్పమని ఒత్తిడి తెచ్చేవాడు" అని అనుపమ తెలిపారు.

పరిచయమైన మూడు నెలలకే ఎంగేజ్‌మెంట్, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని, అది ప్రేమ కాదని, తనను కట్టుబాట్లలో ఉంచే ప్రయత్నమని గ్రహించి ఆ వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చానని ఆమె పేర్కొన్నారు. అయితే ఆ వ్యక్తి పేరును మాత్రం అనుపమ ఎక్కడా వెల్లడించలేదు.

క్యారవాన్‌లో ఏడుస్తూ.. పానిక్ ఎటాక్స్..

ఈ విషపూరితమైన బంధం కారణంగా తీవ్రమైన డిప్రెషన్, యాంగ్జైటీకి గురయ్యానని అనుపమ చెప్పారు. "మానసిక ఒత్తిడి వల్ల శారీరకంగా క్షీణించి బరువు తగ్గిపోయాను. షూటింగ్ సెట్స్‌లో ఉన్నప్పుడు క్యారవాన్‌లోకి వెళ్లి ఒంటరిగా ఏడ్చేదాన్ని. తరచూ పానిక్ ఎటాక్స్ వచ్చేవి. ఆ భయం ఏ స్థాయికి చేరిందంటే.. నా సొంత తమ్ముడిని తాకడానికి కూడా భయపడేదాన్ని. నా కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన డ్రాగన్ సినిమా ప్రమోషన్లకు కూడా ఈ మానసిక వేదన వల్లే దూరంగా ఉండాల్సి వచ్చింది" అని గుర్తుచేసుకున్నారు.

సోషల్ మీడియాలో నెటిజన్ల ఊహాగానాలు

అనుపమ వ్యాఖ్యలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. గతంలో తమిళ నటుడు విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అనుపమ ప్రస్తావించిన వ్యక్తి ఆయనే అయి ఉండవచ్చని నెటిజన్లు, కొన్ని మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

హెచ్చరికగా నిలవాలనే వెల్లడించా:

కాలక్రమేణా ఆ మానసిక గాయం నుంచి తాను కోలుకున్నానని అనుపమ స్పష్టం చేశారు. ప్రేమ పేరుతో ఉండే ఇలాంటి విషపూరిత బంధాలలో చిక్కుకుని నరకం అనుభవిస్తున్న వారికి తన అనుభవం ఒక కంటివిప్పుగా, హెచ్చరికగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలను ధైర్యంగా బయటకు చెప్పినట్లు ఆమె వెల్లడించారు.

Tags: