Vishnu Vishal : నేను అరుదైన వ్యాధితో బాధపడుతున్న ..హీరో విష్ణు విశాల్ ఎమోషనల్ పోస్ట్

హీరో విష్ణు విశాల్ ఎమోషనల్ పోస్ట్

Update: 2026-06-26 11:44 GMT

Vishnu Vishal : వెండితెరపై ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా కనిపించే టాలెంటెడ్ హీరో విష్ణు విశాల్.. గత కొంతకాలంగా ఓ తీవ్రమైన ఆరోగ్య సమస్యతో పోరాడుతున్నారు. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే ఆయన, తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఎమోషనల్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. గత మూడు, నాలుగేళ్లుగా తాను ‘ఆటో ఇమ్యూన్’ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు.

ఈ మేరకు ఇన్స్టాగ్రామ్‌ వేదికగా విష్ణు విశాల్ ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టారు. "నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. చాలా సందర్భాల్లో నా ముఖం అలసిపోయినట్లు ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. దానికి కారణం నా ఆటో ఇమ్యూన్ కండీషన్. దీని కోసం నేను తరచూ మందులు వాడుతున్నాను. ఆ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువయ్యాయి. శరీరం, కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సమస్యకు చికిత్స తీసుకోవడం తప్పనిసరి. అందుకే నేను నా ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నా" అంటూ తన బాధను పంచుకున్నారు విష్ణు విశాల్.

అయితే.. అనారోగ్యం వేధిస్తున్నా, నటుడిగా తన బాధ్యతను ఆయన మరువలేదు. జులై 3న విష్ణు విశాల్ కీలక పాత్రలో నటించిన ‘మట్టి కుస్తీ 2’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఈ క్లిష్ట సమయంలో మీ ప్రేమాభిమానాలతో పాటు, నా పనిపై నాకు ఉన్న నమ్మకం, బాధ్యత.. అలాగే 'మట్టి కుస్తీ 2' సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరి శ్రమ నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. అందుకే ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే, వెనకడుగు వేయకుండా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాను" అని ఎంతో ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు.

త్వరలోనే తన ఆరోగ్యం మెరుగుపడుతుందని, సానుకూల దృక్పథంతో ఉన్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2022లో వచ్చి భారీ విజయాన్ని అందుకున్న ‘మట్టి కుస్తీ’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ ‘మట్టి కుస్తీ 2’ తెరకెక్కింది. చెల్లా అయ్యావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రమోషన్స్ చివరి వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం జులై 3న థియేటర్లలో సందడి చేయనుంది.

Tags:    

Similar News