వెబ్ సీరీస్ టస్కరీతో ఓటిటిలో ఇమ్రాన్ హష్మీ హల్ చల్

సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ తో ముఖాముఖి

Update: 2026-01-22 11:51 GMT

ఇమ్రాన్ హష్మీ పరిశ్రమలోకి వచ్చి దాదాపు 25 ఏళ్లు అవుతోంది. థియేటర్ సినిమాలు, OTT సిరీస్‌లు చేస్తూ , తన కెరియర్ ను బాగా ఆస్వాదిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఆయన తాజా సిరీస్ “టస్కరీ” ప్రస్తుతం OTT చార్ట్స్‌లో నంబర్ వన్‌గా నిలుస్తోంది. ఈ విజయంతో ఆయన కుటుంబం చాలా ఆనందంగా ఉంది. కానీ విజయం ఆయన తలకెక్కనివ్వలేదు. పరాజయాల సమయంలో వచ్చిన నిరాశలు కూడా ఆయనను కుంగదీయలేకపోయాయి. ఇమ్రాన్ హష్మీ: “ప్రజలు మంచి చెప్పినా చెడు చెప్పినా నాకు నిజంగా పెద్దగా పట్టదు. నా ఆత్మవిశ్వాసానికి కారణం నా కుటుంబం, నా పెంపకం.” ఇమ్రాన్ హష్మీ తన సినీ ప్రయాణం గురించి, నటుడిగా మారిన తీరు, ‘సీరియల్ కిస్సర్’ తో ఇమేజ్‌ను మార్చుకున్న విధానం, వైవిధ్యం, విధి, నిడారంబరంగా ఉండటం, అలాగే ఇంటిమసీ కోఆర్డినేటర్‌తో పని చేయడం, సోలో సినిమాలు చేయడం వంటి అంశాలపై PoliTent‌ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.


ముంబయి నుండి మా ప్రతినిధి లిపికా వర్మ - సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ స్పెషల్ ఇంటర్వ్యూ

Q . ప్రేక్షకులు పరిపక్వత సాధించారు, కథన శైలి మారింది. మీ కెరీర్‌లో ఈ దశను ఎలా ఆస్వాదిస్తున్నారు?

A . నిజం చెప్పాలంటే ఈ దశను నేను చాలా ఆస్వాదిస్తున్నాను. సాధారణ కమర్షియల్ స్పేస్‌ కన్నా కూడా ఎక్కువగా. నటుడిగా ప్రేక్షకులకు వైవిధ్యం చూపించడం చాలా అవసరం. ఇప్పుడు అలాంటి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. ఈ రోజుల్లో నేను చేస్తున్న కథలు నన్ను చాలా ఉత్సాహపరుస్తున్నాయి.


Q . మీ తాజా సిరీస్‌కు మంచి స్పందన వచ్చింది. మీకూ, మీ కుటుంబానికీ ఎలా అనిపిస్తోంది?

A . ఇప్పటివరకు చాలా బాగుంది. ప్రజలు దీన్ని ఇష్టపడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకుల స్పందన సానుకూలంగా ఉంటే, మన శ్రమకు విలువ లభించినట్టు అనిపిస్తుంది. నా కుటుంబంతో కలిసి ఐదు ఎపిసోడ్‌లు చూశాను. అందరికీ నచ్చింది. “టాస్కరీ” నంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉండటం మాకు చాలా ఆనందంగా ఉంది.


Q . పరిశ్రమలో దాదాపు 25 ఏళ్లు పూర్తి చేశారు. ఈ ప్రయాణాన్ని ఎలా చూస్తున్నారు?

A . పరిశ్రమ చాలా మారింది. OTT ప్లాట్‌ఫామ్‌లు, థియేటర్ సినిమాలు కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. నటుడికి ఇలాంటి సృజనాత్మక స్వేచ్ఛ ఒక వరం. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవని నేను నమ్ముతాను. ఈ స్థాయికి చేరుకోవడంలో గ్రహాల అనుకూలత కూడా ఉందనుకుంటాను. రెండు దశాబ్దాలకుపైగా నా కెరీర్ సాగింది. ఇప్పుడు ఇలాంటి విభిన్నమైన కథలు రావడం నిజంగా నటుడిగా ఉండటానికి ఉత్తమ సమయం అనిపిస్తోంది. పది సంవత్సరాల క్రితం ఇలాంటి పాత్రలు వస్తాయని కలలో కూడా ఊహించలేకపోయేవాళ్లం. ప్రతి క్షణం ఆస్వాదిస్తున్నాను, ఎందుకంటే భిన్నమైన పాత్రలు చేస్తున్నాను.


Q . మీరు మొదట నటుడిగా మారాలని అనుకోలేదు. VFX లేదా దర్శకత్వం వైపు వెళ్లాలనుకున్నారు. విధి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందని అనుకుంటారా?

A . జీవితం సంకల్పం-విధి ఈ రెండింటి మేళవింపే. కష్టపడటం, ఓర్పు, పట్టుదల మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. కానీ అదృష్టం కూడా పాత్ర పోషిస్తుంది. మొదటినుండీ నేను గొప్ప నటుడినని అనుకోను. కానీ నేర్చుకోవాలనే తపన, ప్రతి సినిమా ద్వారా మెరుగవ్వాలనే సంకల్పం నాకు ఉంది. గొప్ప దర్శకులతో పని చేసే అవకాశం దొరికింది. వేరే రంగంలోకి వెళ్లాలనుకున్న నేను ఇప్పుడు ఈ పరిశ్రమలో సంతోషంగా ఉన్నాను.


Q .ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే దీన్ని “హ్యాపీ యాక్సిడెంట్” అంటారా?

A .ఖచ్చితంగా.. నా తొలి సినిమా నుంచే ఇదే జీవితాంతం ఇదే పని చేయాలని అనిపించింది. అనుకోకుండా జరిగింది, కానీ సరైనదే జరిగింది అనిపించింది.______________

Q . పరిశ్రమ ఎప్పుడైనా మిమ్మల్ని భయపెట్టిందా?

A . నా మొదటి సినిమా సమయంలోనే అలా అనిపించింది. రెండు నెలల్లో నే నా జీవితం మారిపోయింది. వందల మంది ముందు నిలబడి షూటింగ్ చేయడం కష్టంగా అనిపించింది. కానీ ఆ తర్వాత ప్రతి సినిమా విడుదలకు ముందు కాస్త ఆందోళన ఉండేది కానీ అది సహజం. అది కూడా మంచిదే.


Q . ఆందోళన అవసరమేనని అనుకుంటారా?

A . అవును. ఆందోళన లేకపోతే ఏదో తేడా ఉన్నట్టే. కానీ అతిగా ఆత్మవిశ్వాసం ప్రమాదకరం. కొద్దిగా ఆందోళన మనల్ని నేలపై నిలబెడుతుంది.


Q . పేరు, ప్రఖ్యాతులు మీ తలకెక్కలేదని కనిపిస్తోంది. మీ సీక్రెట్ ఏమిటి?

A . విజయాన్నీ, పరాజయాన్నీ చాలా సీరియస్‌గా తీసుకోను. విజయంలో ఆనందిస్తాను, అపజయంలో బాధపడతాను, కానీ అందులోనే ఉండిపోను. పేరు వెంబడి పరుగెత్తేవాళ్లు ఎక్కువకాలం నిలవరు. నేను మంచి నటుడిగా మారాలనుకుంటున్నాను.

Q.విమర్శల ప్రభావం మీపై పడదనిపిస్తోంది. అది ఎలా సాధ్యమైంది?

A. ప్రజలు ఏం చెప్పినా నాకు పెద్దగా పట్టదు. నా ఆత్మవిశ్వాసానికి కారణం నా కుటుంబం, నా పెంపకం. బయటివారి అంగీకారం కోసం నేను ఎదురు చూడను. నన్ను విమర్శించినా నాకు పరవాలేదు. పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచీ ఇదే నా స్వభావం.

Q. సోలో సినిమాలు, నలుగురిలో ఒకరి పాత్రలు, అతిథి పాత్రలు చేశారు. ఏదైనా అసూయ వచ్చిందా?

A. ఎప్పుడూ రాలేదు. మంచి పని చేయాలన్నదే నా కోరిక. సినిమా అనేది సమూహ ప్రయత్నం. ఇతరులతో పోటీ పడకుండా, మీతోనే పోటీ పడాలి. చిన్న పాత్ర అయినా ప్రభావం చూపితే చాలు.


Q.ఇటీవల మీ ఇంటిమసీ కోఆర్డినేటర్ అంశం చర్చకు వచ్చింది.దానిపై మీ అభిప్రాయం?

A.నా పాత పాత్రలను సరదాగా గుర్తు చేసేలా చేయడం ఆసక్తికరంగా అనిపించింది. ఆ ‘వింటేజ్’ టచ్ ప్రేక్షకులకు నచ్చింది, అందుకే వైరల్ అయింది.

Q. ‘సీరియల్ కిస్సర్’ అనే మీఇమేజ్‌ను మార్చారు. ఈ మార్పును ఎలా చూస్తున్నారు?

A. ఇది ప్రతిభ, కష్టపడటం, విధి, అదృష్టం—అన్నింటి కలయిక. నేను పని చేసిన దర్శకులు, రచయితలు నాకు మంచి పాత్రలు ఇచ్చారు. ఒక్క కారణంతో ఇది సాధ్యం కాదు. విభిన్నమైన పాత్రలు చేయడం నాకు ఇష్టం. ప్రభావవంతమైన పనులు చేయడమే నా లక్ష్యం.

Tags:    

Similar News