Ranbir Kapoor and Sai Pallavi: ఆ పాత్ర పోషించడం నా అదృష్టం..రామాయణ’ ప్రమోషన్స్‌లో రణ్‌బీర్, సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్
ఎమోషనల్ కామెంట్స్
Ranbir Kapoor and Sai Pallavi: భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న అద్భుత దృశ్యకావ్యం 'రామాయణ'. నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సీతగా దక్షిణాది స్టార్ నటి సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ ఎవైటెడ్ ట్రైలర్ జులై 24న విడుదల కానుంది. ఇందులో భాగంగా ఢిల్లీలో 'ప్రథమ్ సంకల్ప్' పేరుతో చిత్ర యూనిట్ ఓ భారీ వేడుకను నిర్వహించింది.
ఈ వేడుకలో రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. చిన్నప్పటి నుంచి శ్రీరాముడి కథలు వింటూ పెరిగానని, ఆ దేవుడిని ఎప్పుడూ తన మనసులోనే ఉంచుకుని జీవించానని చెప్పారు. అలాంటి రాములవారి పాత్రను పోషించే అవకాశం రావడం తన అదృష్టమని రణ్‌బీర్ పేర్కొన్నారు. గతంలో రామానంద్ సాగర్ 'రామాయణం' సీరియల్‌లో అరుణ్ గోవిల్ రాముడి పాత్రలో అద్భుతంగా నటించి, కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ఇక సీతమ్మ పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి మాట్లాడుతూ.. ఇలాంటి గొప్ప పౌరాణిక పాత్రలు పోషించడం ప్రతి నటుడికి ఒక పెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో పాత్రలు భవిష్యత్తు తరాలకు పురాణ రూపాలుగా గుర్తుండిపోతాయన్నారు. సీతమ్మ పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి శాయశక్తులా ప్రయత్నించానని, ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు దర్శకుడికి, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం ఇదని సాయి పల్లవి ఆనందం వ్యక్తం చేశారు.
మరోవైపు దర్శకుడు నితీశ్ తివారీ మాట్లాడుతూ.. రామాయణం గొప్పతనం దాని పరిమాణంలో కాదు, అందులోని విలువల్లో ఉందన్నారు. సంపూర్ణ నిజాయితీ, ప్రామాణికత, అత్యంత గౌరవంతో ఈ కథను తెరపై ఆవిష్కరించడమే తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సినిమాతో ప్రేక్షకులు రామాయణంలోని మానవత్వాన్ని, భావోద్వేగాన్ని గ్రహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. అందులో 'రామాయణ: పార్ట్ 1' దీపావళి కానుకగా నవంబరులో విడుదల కాబోతోంది. ఢిల్లీలో జరిగిన ఈ ఘనమైన కార్యక్రమంలో రణ్‌బీర్, సాయిపల్లవితో పాటు రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, సన్నీ దేవోల్, శోభన తదితరులు సందడి చేశారు.