Actress and BJP MP Kangana Ranaut: న్యాయం జరిగింది: కంగనా భావోద్వేగం
కంగనా భావోద్వేగం
Actress and BJP MP Kangana Ranaut: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతుండటంతో నటి, బిజెపి ఎంపీ కంగనా రనౌత్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ బాడీగా పేరున్న బీఎంసీలో బిజెపి సాధించిన ఈ అఖండ విజయంపై ఆమె ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లకు అభినందనలు తెలిపారు. ఈ గెలుపు కంగనాకు వ్యక్తిగతంగా ఒక తీపి జ్ఞాపకం వంటిది. 2020లో శివసేన అధికారంలో ఉన్నప్పుడు, ముంబైలోని ఆమె కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు అక్రమ కట్టడం అంటూ కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆ చర్యను బాంబే హైకోర్టు సైతం చట్టవిరుద్ధం, ద్వేషపూరితమైనది అని తప్పుబట్టింది. నేడు అదే శివసేన (UBT) బీఎంసీలో అధికారాన్ని కోల్పోవడంపై కంగనా స్పందిస్తూ.. "నన్ను దూషించి, నా ఇంటిని కూల్చివేసి, మహారాష్ట్ర వదిలి వెళ్ళమని బెదిరించిన వారిని నేడు మహారాష్ట్ర ప్రజలే వదిలిపెట్టారు" అని వ్యాఖ్యానించారు. మహిళా ద్వేషులు, నెపోటిజం మాఫియాకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని ఆమె విమర్శించారు. కేవలం ముంబైలోనే కాకుండా పూణే, పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కూడా రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో తిరుగులేని శక్తిగా ఉన్న 'పవార్' బ్రాండ్ (శరద్ పవార్, అజిత్ పవార్) ఇప్పుడు ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ విడిగా పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. మహారాష్ట్ర మున్సిపల్ రాజకీయాల్లో బిజెపి తిరుగులేని ఆధిపత్యాన్ని ఈ ఫలితాలు చాటుతున్నాయి.