Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1 ప్రభంజనం.. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు
Kantara Chapter 1: రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ స్పందించగా.. తాజాగా స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సైతం ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.
మాస్టర్ పీస్, 'సినిమాటిక్ ప్రభంజనం
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, కాంతార చాప్టర్ 1ను నిజమైన మాస్టర్ పీస్‌గా అభివర్ణించారు. "ఇండియన్ సినిమా ఇంతకు ముందు ఇలాంటి చిత్రాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇది ఒక సినిమాటిక్ ప్రభంజనం. స్వచ్ఛమైన భక్తి ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. దీనిని ఎవరూ దాటలేరు’’ అని ఆయన మెచ్చుకున్నారు. సినిమాకు రిషబ్ శెట్టిని నిజమైన వన్-మ్యాన్ షో'గా పేర్కొన్నారు. "ఈ మూవీని ఒంటి చేత్తో రూపొందించడమే కాకుండా ముందుకు తీసుకెళ్లాడు" అని ప్రశంసించారు. అలాగే సినిమాకు ప్రధాన బలంగా నిలిచిన బీజీఎమ్ గురించి మాట్లాడుతూ.. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అద్భుతంగా ఉందని కొనియాడారు.
రిషబ్ శెట్టి నటనకు ప్రభాస్ ఫిదా..!
కాంతార చాప్టర్ 1 విడుదలైన కొన్ని గంటల్లోనే హీరో ప్రభాస్ స్పందించారు. "కాంతార ఛాప్టర్ 1 బ్రిలియంట్ మూవీ. ఇందులో నటించిన వారందరి ప్రతిభ చాలా బాగుంది. ఈ ఏడాది అతిపెద్ద విజయంగా కాంతార 1 నిలుస్తుంది" అని ఆయన తన సోషల్ మీడియా స్టోరీలో రాశారు. ఈ సినిమాకు ప్రధాన బలం రిషబ్ శెట్టి నటనే అని ప్రభాస్ స్పష్టం చేశారు. అలాగే నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (విజయ్ కిరగండూర్) విజయాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఘన విజయం సాధించిన చిత్ర యూనిట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
టికెట్ల అమ్మకాల్లో రికార్డు సృష్టి
విమర్శకుల ప్రశంసలతో పాటు కాంతార చాప్టర్ 1 టికెట్ల అమ్మకాల్లో కూడా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. బుక్‌మైషోలో పీక్ టైమ్‌లో ప్రతి గంటకు సుమారు 60 వేల టికెట్లు అమ్ముడవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ఏకంగా 5 లక్షలకు పైగానే టికెట్లు అమ్ముడుపోతున్నట్లు సమాచారం. ఈ లెక్కలు సినిమాకు ఉన్న భారీ క్రేజ్‌ను స్పష్టం చేస్తున్నాయి.