Karisma Kapoor: 30 వేల కోట్ల ఆస్తి వివాదం.. కరిష్మా కపూర్ పిల్లలకు బిగ్ రిలీఫ్
కరిష్మా కపూర్ పిల్లలకు బిగ్ రిలీఫ్
Karisma Kapoor: బాలీవుడ్ సీనియర్ నటి కరిష్మా కపూర్ పిల్లలకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. గత కొన్ని నెలలుగా తమ తండ్రి ఆస్తుల కోసం సాగిస్తున్న పోరాటంలో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుమారు 30 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తి వివాదంలో సవతి తల్లి ప్రియా సచ్‌దేవ్‌కు కోర్టులో చుక్కెదురైంది.
కరిష్మా కపూర్ మాజీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ గతేడాది జూన్‌లో కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత ఆస్తుల పంపిణీ విషయంలో వివాదం మొదలైంది. సంజయ్ కపూర్ మొదటి భార్య పిల్లలైన సమైరా, కియాన్‌లను కాదని.. ఆస్తులన్నింటినీ చేజిక్కించుకునేందుకు సవతి తల్లి ప్రియా సచ్‌దేవ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ కరిష్మా పిల్లలు గతేడాది సెప్టెంబరులో కోర్టును ఆశ్రయించారు.
సవతి తల్లి ప్రియా సచ్‌దేవ్ కొందరితో కుమ్మక్కై నకిలీ పత్రాలను సృష్టించారని, వీలునామాలో కూడా తండ్రి సంతకాలను ఫోర్జరీ చేశారని సమైరా, కియాన్ కోర్టుకు వివరించారు. ఈ వాదనలను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. సంజయ్ కపూర్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే, ఆస్తులను దుర్వినియోగం చేయకుండా, విక్రయించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
వీలునామా చట్టబద్ధతపై అనేక అనుమానాలు ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆ వీలునామా సరైనదేనని నిరూపించాల్సిన బాధ్యత ప్రియా సచ్‌దేవ్‌పైనే ఉందని వ్యాఖ్యానించింది. ఆస్తులను రక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ బ్యాంకు లావాదేవీలపై ఆంక్షలు విధించింది.