Katrina Kaif : తనయుడి పేరు ప్రకటించిన కత్రినా కైఫ్

కత్రినా కైఫ్

Update: 2026-01-08 05:27 GMT

Katrina Kaif : బాలీవుడ్ వెండితెరపై తన అందచందాలతో కోట్లాది మంది మనసు గెలుచుకున్న కత్రినా కైఫ్, వైవిధ్యమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విక్కీ కౌశల్ దంపతులు తమ జీవితంలోని అత్యంత అద్భుతమైన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. నవంబర్ 7, 2025న తమ జీవితాల్లోకి వచ్చిన చిన్ని ప్రాణానికి 'విహాన్' అని నామకరణం చేసి, నేడు (జనవరి 7, 2026) ప్రపంచానికి పరిచయం చేశారు.

విహాన్' అంటే సంస్కృతంలో 'తొలి సూర్యకిరణం' లేదా 'కొత్త ఉదయం' అని అర్థం. తమ జీవితాల్లో కొత్త ఉదయాన్ని తీసుకొచ్చిన చిన్నారికి ఈ పేరు పెట్టడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విశేషమేమిటంటే, విక్కీ కౌశల్ కెరీర్‌లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అయిన 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' సినిమాలో ఆయన పోషించిన పాత్ర పేరు కూడా 'మేజర్ విహాన్ సింగ్ షెర్గిల్' దీంతో ఈ పేరుకు విక్కీ కెరీర్‌తోనూ ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.

"మా కిరణం.. మా లోకం.. విహాన్ కౌశల్. మా ప్రార్థనలు ఫలించాయి.. జీవితం చాలా అందంగా ఉంది. మా ప్రపంచం ఒక్క క్షణంలో మారిపోయింది" అంటూ ఈ జంట సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. చిన్నారి విహాన్ ఫోటో చూసిన బాలీవుడ్ ప్రముఖులు హృతిక్ రోషన్, కరణ్ జోహార్, పరిణీతి చోప్రాతో పాటు లక్షలాది మంది అభిమానులు "లిటిల్ విక్కీ" అంటూ అభినందనలు కురిపిస్తున్నారు.2021లో పెళ్లి పీటలెక్కిన ఈ జంట, సరిగ్గా నాలుగేళ్ల తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొంది, ఇప్పుడు 'విహాన్' రాకతో తమ కుటుంబాన్ని పరిపూర్ణం చేసుకున్నారు.

Tags:    

Similar News