Actress Keerthy Suresh: విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లోకి కీర్తి సురేష్
కీర్తి సురేష్
Actress Keerthy Suresh: సౌత్ స్టార్ హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ఇటీవల తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి కొచ్చిలోని తమ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లోకి అడుగుపెట్టారు. 15 ఏళ్ల సుదీర్ఘ ప్రేమ ప్రయాణం తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట, తమ ఇంటికి "ది హౌస్ ఆఫ్ ఫన్" అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు. ఈ ఇంటి ఇంటీరియర్స్. ప్రత్యేకతలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
సాధారణ సెలబ్రిటీల ఇళ్లకు భిన్నంగా, కీర్తి తన ఇంటిని చాలా సరదాగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దుకున్నారు. ముఖ్యంగా వంటగది, డైనింగ్ ఏరియాను ఒక మోడ్రన్ కేఫ్ లాగా డిజైన్ చేశారు. "మింగ్ జేడ్" గ్రీన్ కలర్ క్యాబినెట్‌లు, పసుపు-పచ్చ రంగుల టైల్స్‌తో ఈ ప్రాంతం చాలా వైబ్రంట్‌గా కనిపిస్తుంది. వంటగది గోడపై "ఈ వంటగది ప్రేమతో నిండి ఉంది" అనే అర్థం వచ్చేలా రాసి ఉన్న వాక్యాలు ఆ ఇంటి పట్ల వారికున్న మమకారాన్ని చాటుతున్నాయి.
ఈ ఇంటికి ప్రధాన ఆకర్షణ భారీ బాల్కనీ. కొచ్చి నగరం మొత్తం కనిపించేలా ఉన్న ఈ బాల్కనీలో ఒక ప్రత్యేకమైన 'రెసిన్ బార్ కౌంటర్' ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఆ కౌంటర్ ఉపరితలం కింద కీర్తి-ఆంటోనీల 15 ఏళ్ల ప్రేమ ప్రయాణానికి సంబంధించిన వందలాది ఫోటోలను భద్రపరిచారు. ఇది కేవలం ఫర్నిచర్ లాగా కాకుండా, వారి జ్ఞాపకాల గనిగా కనిపిస్తుంది. అలాగే బాల్కనీలోని ఒక వైపు కీర్తి తన యోగా సాధన కోసం పచ్చని మొక్కలతో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించుకున్నారు.
ఇంటి గోడలపై కీర్తి సురేష్ సినీ ప్రస్థానానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఆమెకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్‌లు, నాటి పత్రికా వార్తల క్లిప్పింగ్‌లతో కూడిన ఒక కొల్లాజ్ అందరినీ ఆకట్టుకుంటుంది. అలాగే 2024లో గోవాలో జరిగిన వీరి వివాహ వేడుకకు సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు, వెడ్డింగ్ కార్డ్ కూడా ఫ్రేమ్ కట్టించి అందంగా అలంకరించారు.
ఇల్లు మొత్తం ఆర్కిటిక్ స్టైల్, స్పానిష్ డిజైన్ల కలయికతో ఉంటుంది. ఇటుక గోడల ఎఫెక్ట్ , లేత రంగుల పెయింటింగ్స్ ఇంటికి ఒక హుందాతనాన్ని ఇస్తాయి. ఇక వీరి పెంపుడు కుక్క ‘నైక్’ (Nyke) కు కూడా ఇంట్లో ప్రత్యేక స్థానం ఉంది. ఆంటోనీ, కీర్తి పేర్లలోని చివరి అక్షరాలను కలిపి దానికి 'నైక్' అని పేరు పెట్టడం విశేషం. మొత్తం మీద ఈ "హౌస్ ఆఫ్ ఫన్" కీర్తి సురేష్ వ్యక్తిత్వానికి నిలువు అద్దంలా కనిపిస్తోంది.