Ram Charan’s ‘Peddi’ Release: రామ్‌చరణ్ పెద్ది రిలీజ్‌కు లైన్ క్లియర్

పెద్ది రిలీజ్‌కు లైన్ క్లియర్

Update: 2026-05-28 02:27 GMT

Ram Charan’s ‘Peddi’ Release: మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ జూన్‌ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రదర్శనపై మొదలైన వివాదాన్ని పరిష్కరిస్తూ... ‘పెద్ది’ చిత్రాన్ని పాత రెంటల్‌ (అద్దె) విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ ఎగ్జిబిటర్లు తీసుకున్న సానుకూల నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఫిల్మ్‌ ఛాంబర్‌ కమిటీ ఇచ్చే నివేదిక మేరకు అందరూ నడుచుకోవాలని ఆయన సూచించారు.

చిరంజీవితో భేటీ ముగిసిన అనంతరం తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధికారిక ప్రెస్ నోట్‌ విడుదల చేసింది.జూన్‌ 30 లోగా పర్సంటేజీ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తానని మెగాస్టార్ చిరంజీవి మాకు హామీ ఇచ్చారు. అందుకే జూన్‌ 30 తర్వాత విడుదలయ్యే చిత్రాలకే కొత్త పర్సంటేజీ విధానాన్ని వర్తింపజేస్తాం. జులై 3 నుంచి థియేటర్లలో సరికొత్త పర్సంటేజీ విధానం అమలు కానుంది. ఆ రోజు నుంచి రెంటల్‌ సిస్టమ్‌ పూర్తిగా రద్దవుతుంది. అని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ స్పష్టం చేసింది.

నిజానికి సింగిల్‌ స్క్రీన్లలోనూ పర్సంటేజీ విధానంలోనే సినిమాలు ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు పట్టుబట్టడం.. దాన్ని కొందరు నిర్మాతలు వ్యతిరేకించడంతో ఈ సమస్య పెద్దదైంది. ‘పెద్ది’ సినిమా విడుదలకు అడ్డంకులు వచ్చేలా కనిపించడంతో మెగాస్టార్ స్వయంగా రంగంలోకి దిగి, రెండు సార్లు ఎగ్జిబిటర్లతో చర్చలు జరిపి వివాదాన్ని చక్కదిద్దారు. చిరంజీవి చొరవతో ‘పెద్ది’ సినిమా థియేట్రికల్ విడుదలకు లైన్ క్లియర్ అవ్వడమే కాకుండా, ఇండస్ట్రీలో పెద్ద సమస్య సర్దుమణగడంతో అటు మెగా ఫ్యాన్స్, ఇటు సినీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.

Tags:    

Similar News