Manchu Manoj: మంచు మనోజ్ ఐక్య ధైర్య సేనా సమితి ట్రస్ట్ ప్రారంభం
ఐక్య ధైర్య సేనా సమితి ట్రస్ట్ ప్రారంభం
Manchu Manoj: టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సమాజ సేవలో సరికొత్త అడుగు వేశారు. తెలుగు రాష్ట్రాల్లో తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేందుకు ఆయన సరికొత్త ట్రస్ట్‌ను ప్రారంభించారు. మే 20న రానున్న తన పుట్టినరోజును పురస్కరించుకుని.. ఆదివారం రోజే ఈ ట్రస్ట్‌కు శ్రీకారం చుట్టారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి నవీన్ యాదవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ సేవా సంస్థ పేరును అధికారికంగా ప్రకటించారు.
ఈ ట్రస్ట్‌కు ‘ఐక్య ధైర్య సేనా సమితి’ అని పేరు పెట్టారు. ఈ సంస్థ ద్వారా సమాజంలో వెనుకబడిన వారికి, నిరుపేదలకు అండగా నిలవడమే కాకుండా.. రక్తదానం, చిన్నారుల దత్తత వంటి అనేక అద్భుతమైన సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్, ఆయన భార్య భుమా మౌనిక రెడ్డిలను ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రత్యేకంగా అభినందించారు. వారి ఆశయానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
ఈ ట్రస్ట్ స్థాపన తన సతీమణి మౌనిక ఆలోచనేనని మంచు మనోజ్ సగర్వంగా ప్రకటించారు. ఇతరులకు సహాయం చేయడం తామిద్దరం పెద్దల నుంచి నేర్చుకున్న సంస్కారమని ఆయన అన్నారు. పదిమందికి మంచి చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ ‘ఐక్య ధైర్య సేనా సమితి’ ఒక ఉమ్మడి వేదికగా మారుతుందని మనోజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఈ ట్రస్ట్ ద్వారా తాము ఐదుగురు చిన్నారులను దత్తత తీసుకుని, వారి చదువు, భవిష్యత్తు బాధ్యతలను పూర్తిగా చూసుకోబోతున్నట్లు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆపన్నహస్తం కోసం ఎదురుచూసే ప్రతి ఒక్కరికీ ఈ సంస్థ అండగా ఉంటుందని.. అప్పుడే ఈ ట్రస్ట్ నిజమైన విజయం సాధించినట్లని మనోజ్ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.