Mega Power Star: మల్టీప్లెక్స్ దోపిడీపై మెగా పవర్‌స్టార్ సంచలన వ్యాఖ్యలు

సంచలన వ్యాఖ్యలు

Update: 2026-06-24 03:17 GMT

Mega Power Star: న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక నేషనల్ మీడియా ‘రిపబ్లిక్ సమ్మిట్ 2026’ వేదికగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. థియేటర్లలో, ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లలో విక్రయించే ఆహార పదార్థాలు, పానీయాల అధిక ధరలపై ఆయన సామాన్య ప్రేక్షకుల పక్షాన నిలబడి గళమెత్తారు. సినిమా టికెట్ల ధరల కంటే అక్కడ అమ్మే స్నాక్స్ ధరలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు పెను భారంగా మారాయని ఆయన కుండబద్దలు కొట్టారు. ఒక అగ్ర హీరో మల్టీప్లెక్స్ యాజమాన్యాల దోపిడీపై బహిరంగంగా ఈ స్థాయిలో స్పందించడం ఇదే తొలిసారి కావడంతో, ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

​సమ్మిట్‌లో భాగంగా భారతీయ సినిమా భవిష్యత్తు మరియు ప్రేక్షకుల ఆదరణపై జరిగిన చర్చలో రామ్ చరణ్ మాట్లాడారు. "ఈ రోజుల్లో ఒక మధ్యతరగతి కుటుంబం అంతా కలిసి థియేటర్‌కి వెళ్లి హ్యాపీగా సినిమా చూడటానికి ప్రధాన అడ్డంకి సినిమా టికెట్ ధరలు కాదు. థియేటర్ లోపల విక్రయించే పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ ధరలే. టికెట్ ధర ₹150 లేదా ₹200 ఉంటే.. ఒక చిన్న టబ్‌ పాప్‌కార్న్, డ్రింక్ ధరలు ₹400 నుండి ₹500 వరకు ఉంటున్నాయి. నలుగురు ఉన్న కుటుంబం థియేటర్‌కి వస్తే కేవలం ఇంటర్వెల్ స్నాక్స్ కోసమే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ విపరీతమైన ధరల భయం వల్లే చాలా మంది కుటుంబాలు థియేటర్లకు రావడానికి వెనుకాడి, ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు" అని రామ్ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

​పరిశ్రమ మనుగడ సాగించాలన్నా, ఫ్యామిలీ ఆడియన్స్ మళ్లీ థియేటర్ల వైపు అడుగులు వేయాలన్నా మల్టీప్లెక్స్ యాజమాన్యాలు తమ వ్యాపార ధోరణిని మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఆహార పదార్థాల ధరలను సామాన్యుడికి అందుబాటులోకి తెస్తేనే థియేటర్ల భవిష్యత్తు బాగుంటుందని స్పష్టం చేశారు. సామాన్య సినిమా ప్రేక్షకుడు ఎదుర్కొంటున్న అత్యంత ప్రధానమైన సమస్యను గుర్తించి, ఏమాత్రం సంకోచించకుండా కార్పొరేట్ థియేటర్ల విక్రయాలపై చరణ్ మాట్లాడిన తీరును సినీ అభిమానులతో పాటు సాధారణ నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు. మల్టీప్లెక్స్‌ల దోపిడీపై ‘పెద్ది’ హీరో చేసిన ఈ వ్యాఖ్యలు రానున్న రోజుల్లో పరిశ్రమలో మరియు థియేటర్ల యాజమాన్యాలలో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో చూడాలి.

Tags:    

Similar News