నా నెక్ట్స్ సినిమా కమల్ బ్యానర్‌లోనే - రజనీకాంత్
కమల్ బ్యానర్‌లోనే - రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను కమల్ హాసన్ బ్యానర్‌లో సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. రజనీకాంత్ ఇటీవల కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం జైలర్ 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం కేరళలోని పాలక్కడ్‌కు వెళ్లేందుకు రజనీకాంత్ చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
మీడియా ప్రతినిధులు తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అడగగా రజనీకాంత్ స్పందిస్తూ.."నా తదుపరి చిత్రం రాజ్ కమల్ బ్యానర్‌లో ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా ఖరారు కాలేదు. కమల్ హాసన్, నేను కలిసి నటించాలని చాలామంది కోరుకుంటున్నారు. మేము కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఎదురుచూస్తున్నాం. మంచి కథ లభించినప్పుడు, మేము కచ్చితంగా కలిసి నటిస్తాం. ఈ సినిమాకు ఇంకా కథ, దర్శకుడు ఖరారు కాలేదు. దీనిపై త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం" అని తెలిపారు.
దీంతో దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజ నటులు కలిసి నటించబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.