Akkineni Nagarjuna: నాగార్జున పర్సనాలిటీ రైట్స్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

Update: 2025-09-25 08:41 GMT

Akkineni Nagarjuna: తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా గుర్తింపు పొందిన అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటో, వాయిస్ లేదా ఇతర వ్యక్తిగత అంశాలను వాడకుండా నిషేధించాలని ఆయన పిటిషన్‌లో కోరారు. సోషల్ మీడియా, ప్రకటనలు, ఆన్‌లైన్ వేదికలలో ప్రముఖుల పేర్లు, ఫోటోలు విస్తృతంగా దుర్వినియోగమవుతున్నాయి. తప్పుదారి పట్టించే లేదా మోసపూరిత వ్యవహారాల్లో ప్రముఖుల ప్రమేయం లేకుండానే వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున తన "పర్సనాలిటీ రైట్స్" రక్షణ కోసం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

గతంలో ఇలాంటి కేసుల్లో బాలీవుడ్ ప్రముఖులైన అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ వంటి వారు కూడా తమ పేరు, ఫోటోలను అనుమతి లేకుండా వాడరాదని కోర్టును కోరారు. అప్పట్లో ఢిల్లీ హైకోర్టు ఈ దుర్వినియోగాన్ని నిషేధిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ తేజస్ కారియా విచారించారు. ఈ సందర్భంగా పర్సనాలిటీ రైట్స్ ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. వినియోగదారుల హక్కులు, సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల మధ్య సమతుల్యం అవసరమని న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

పర్సనాలిటీ రైట్స్ అనేది ఒక వ్యక్తి యొక్క పేరు, రూపం, వాయిస్, శైలి వంటి అంశాలను వాణిజ్య ప్రయోజనాల కోసం అనుమతి లేకుండా ఉపయోగించకూడదనే హక్కు. సినీ తారలతోపాటు క్రీడాకారులు, రాజకీయ నేతలు కూడా ఈ హక్కులను కాపాడుకోవడానికి కోర్టును ఆశ్రయిస్తున్నారు. డిజిటల్ యుగంలో ఫేక్ ప్రమోషన్స్, స్కామ్‌లతోపాటు పేర్లు, ఫోటోల దుర్వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో నాగార్జున పిటిషన్ ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో కోర్టు తీర్పు ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News