Anasuya Bharadwaj: సోషల్ మీడియాలో నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌ను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన, గౌరవానికి భంగం కలిగించే పోస్టులు పెడుతున్న వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై అనసూయ గట్టిగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. అరెస్ట్ అయిన వ్యక్తిని నల్గొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ మండలం, అల్వాల గ్రామానికి చెందిన దోరేపల్లి చంటి (30) గా పోలీసులు గుర్తించారు. ఇతను ఇన్‌స్టాగ్రామ్‌లో @chantidhorapally అనే అకౌంట్ ద్వారా అనసూయపై అసహ్యకరమైన కామెంట్లు, పోస్టులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

గతేడాది డిసెంబర్ 23 నుంచి కొందరు వ్యక్తులు, మరికొన్ని సోషల్ మీడియా పేజీలు పనిగట్టుకుని తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారని అనసూయ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ దేవరకొండ, శివాజీ వంటి నటుల విషయంలో జరిగిన వివాదాల సమయంలో కొందరు నెటిజన్లు, హీరోల ఫ్యాన్స్ హద్దులు దాటి ప్రవర్తించారని, ఇది తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనసూయ ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు ఐటీ చట్టం (IT Act) లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడు చంటిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతనిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎవరినైనా కించపరిచేలా లేదా అసభ్యకరంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని లేదా సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.

Tags: