మా శరీరం.. మా ఇష్టం: అనసూయ

మా ఇష్టం: అనసూయ

Update: 2025-12-24 05:06 GMT

నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ సింగర్ చిన్మయి, నటీమణులు అనసూయ భరద్వాజ్, మంచు మనోజ్ , నవదీప్ తమ నిరసనను వ్యక్తం చేశారు.

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద శివాజీ తీరుపై మండిపడ్డారు. "ఆయన స్వయంగా జీన్స్, హూడీ ధరించి.. నటీమణులకు మాత్రం భారతీయ సంప్రదాయాల గురించి హితోక్తులు చెప్పడం హాస్యాస్పదం. ఆయన తర్కం ప్రకారమే అయితే, ఆయన కూడా ధోతీ ధరించి సంప్రదాయాన్ని పాటించాలి కదా? వివాహం చేసుకున్న పురుషులు కూడా బొట్టు పెట్టుకుని, మెట్టెలు ధరించాలా? ఈ వ్యాఖ్యలు సమాజంలో మహిళలను చూసే కోణాన్ని ప్రతిబింబిస్తున్నాయి" అని ఆమె ధ్వజమెత్తారు.

నటి, టీవీ వ్యాఖ్యాత అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా శివాజీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "ఇది మా శరీరం, మీది కాదు. మాకు నచ్చినట్లుగా మేము జీవిస్తాం" అని ఆమె స్పష్టం చేశారు. అనంతరం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. "ఎవరైనా తమకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు కలిగి ఉంటారు. ఆయన వ్యాఖ్యలు కేవలం ఆయన అభద్రతాభావాన్ని సూచిస్తున్నాయి. ఆహారం, దుస్తులు అనేవి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు. ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరం" అని అన్నారు.

నటుడు మంచు మనోజ్ కూడా శివాజీ వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. శివాజీ తరపున తాను క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొంటూనే.. ఇలాంటి వ్యాఖ్యలను సామాన్యీకరించడం లేదా విస్మరించడం సరికాదని అన్నారు. "మహిళలకు ఎప్పుడూ గౌరవం, సమానత్వం దక్కాలి. ఇలాంటి విషయాల్లో జవాబుదారీతనం చాలా అవసరం" అని ఆయన నొక్కి చెప్పారు.

'దండోరా' ఈవెంట్‌లో శివాజీ పక్కనే ఉన్న నటుడు నవదీప్ కూడా ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఆ సమయంలో శివాజీ మాట్లాడిన తీరు గౌరవప్రదంగా లేదని, ఒకరి అభిప్రాయాన్ని ఇంత అగౌరవంగా వ్యక్తం చేయడం అంగీకరించలేని విషయమని నవదీప్ పేర్కొన్నారు.

Tags:    

Similar News